పోలీసుల అత్యుత్సాహం: వైఎస్సార్‌సీపీ నేతల హౌజ్‌ అరెస్ట్‌

21 Nov, 2018 08:01 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: వైఎస్సార్‌ కడప జిల్లాలో పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శిస్తున్నారు. పార్టీ కార్యక్రమానికి హాజరు కావాల్సిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలను పోలీసులు బుధవారం హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. పులివెందులలో వైఎస్సార్‌ సీపీ మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలను, కడపలో మేయర్‌ సురేశ్‌ బాబును, ఎర్రగుంటలో జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్‌రెడ్డిలను పోలీసులు వారి ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిర్భంధించారు. 

వివరాల్లోకి వెళితే.. జమ్మలమడుగు మండలం గొరిగేనూర్‌కు చెందిన చాలా మంది కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరేందుకు బుధవారం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం వైఎస్సార్‌ సీపీ నాయకులు అవినాశ్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, సురేశ్‌బాబు, శంకర్‌రెడ్డిలను తమ గ్రామానికి ఆహ్వానించారు. ముందుగా అనుకున్న ప్రకారం నేతలు నేడు ఆ గ్రామంలో పర్యాటించాల్సి ఉంది. కాగా, పోలీసులు మాత్రం మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రాబల్యం ఉన్న గ్రామం అంటూ వైఎస్సార్‌ సీపీ నేతలను హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. నేతలు మాత్రం చట్టానికి లోబడి శాంతియుతంగా తమ పర్యటన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం తమకు దేశంలో ఎక్కడికైన వెళ్లే హక్కు ఉందని గుర్తుచేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో.. హౌజ్‌ అరెస్ట్‌ల పేరుతో ప్రతిపక్ష నేతల హక్కులను కాలరాయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని వార్తలు