'మళ్లీ ఆ పదవి కోసం పోటీ చేయదలుచుకోలేదు'

25 Dec, 2017 19:59 IST|Sakshi

సాక్షి, కర్నూలు: వ్యవస్థలను, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలను సీఎం చంద్రబాబు నాయుడు అపహాస్యం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత బీవై రామయ్య మండిపడ్డారు. ప్రస్తుతం జరగనున్న కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికతో ప్రజాస్వామ్యం మరోమారు అపహాస్యం కావడం ఇష్టం లేని కారణంగా తృణప్రాయంగా ఎమ్మెల్సీ పదవిని త్యజించిన మేం.. మళ్లీ ఆ పదవి కోసం పోటీ చేయదలుచుకోలేదన్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అవినీతి సొమ్మును వరదలా పారిస్తున్నారని విమర్శించారు.

గతంలో కర్నూలు స్థానిక సంస్థల్లో సంఖ్యా పరంగా మాకే మెజారిటీ ఉన్నా రెండుసార్లు టీడీపీ సిగ్గు లేకుండా ఫిరాయింపులను ప్రోత్సహించిందని ఈ సందర్భంగా బీవై రామయ్య గుర్తుచేశారు. మరోమారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవినీతికి అవకావం ఇవ్వకూడదని, ప్రజాస్వామ్యం అభాసుపాలు కాకూడదని వైఎస్ఆర్ సీపీ భావిస్తోందన్నారు. చంద్రబాబుకు నిజంగానే ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని బీవై రామయ్య డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు