బీజేపీని కర్ణాటకలో దెబ్బకొట్టే కాంగ్రెస్‌ వ్యూహమిదే..! | Sakshi
Sakshi News home page

బీజేపీని కర్ణాటకలో దెబ్బకొట్టే కాంగ్రెస్‌ వ్యూహమిదే..!

Published Mon, Dec 25 2017 7:54 PM

Karnataka Congress Aims to Take on BJP Hindutva - Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు ఉండగానే రాజకీయ సమీకరణలు వేగం పుంజుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటకను బీజేపీ చేతుల్లోకి పోకుండా చూసుకోవాలని అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పనిచేసిన తీరును చూసి కచ్చితంగా తాము విజయం సాధిస్తామని కర్ణాటక కాంగ్రెస్‌ శ్రేణులు ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ గాంధీ మునుపటికంటే మెరుగ్గా పనితనం చూపిస్తుండటంతోపాటు అధికారంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తుండంతో రాహుల్‌ కొత్త అవతారం తమకు తిరిగి కర్ణాటకలో అధికారం కట్టబెడుతుందని అక్కడి కాంగ్రెస్‌ పెద్దలు అనుకుంటున్నారు.

ముఖ్యంగా బీజేపీ పట్టుకున్న మత కార్డును తామే ముందుగా వాడుకొని బీజేపీ కంటే వేగంగా విజయంవైపు దూసుకెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే బీజేపీ టిప్పు సుల్తాన్‌ జయంతివంటి వాటిని విమర్శిస్తుండటంతోపాటు హిందూ, ముస్లిం పేరిట కాంగ్రెస్‌పై దాడులు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా అదే స్థాయి విమర్శలను ఎక్కుపెట్టాలనుకుంటోంది. కొంతమంది సీనియర్‌ నేతల అభిప్రాయం ప్రకారం రాహుల్‌ గాంధీని తమ రాష్ట్రంలో ముఖ్యమైన ఓ డజను ఆలయాలు సందర్శింపజేసి, శక్తిమంతమైన మతాచార్యులతో భేటీ అయ్యేలా చేయగలిగితే కాంగ్రెస్‌ పార్టీ మతం పేరుతో చేస్తున్న రాజకీయాలను దెబ్బకొట్టొచ్చని కాంగ్రెస్‌ భావిస్తోంది.

ఓ టాప్‌ నాయకుడు ఓ మీడియాతో మాట్లాడుతూ ‘నిజమైన హిందుత్వ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. అలాగే జాతీయవాద పార్టీ. బీజేపీ మాదగ్గర నుంచి అది హైజాక్‌ చేసి మమ్మల్ని హిందూవ్యతిరేకులుగా ముద్ర వేస్తోంది. బీజేపీ వేసిన ఆ ఉచ్చులో మా వాళ్లు కూడా పడ్డారు. ఇప్పుడు గతంలో ఏం జరిగిందో ఆ తప్పును సరిదిద్దుకుంటున్నాం. కాంగ్రెస్‌లో చాలా మంది నేతలు హిందువులే. మా ప్రధానులు, ముఖ్యమంత్రులు 90శాతం హిందువులే. అలాంటిది మమ్మల్ని ఎలా హిందూ వ్యతిరేకులు అని అంటారు. రాహుల్‌ గాంధీ ఓ సాధారణ హిందువుగా ఉండటంలేదు.. ఒక నిజమైన హిందువు ఏం చేయాలో అవన్నీ రాహుల్‌ చేస్తున్నారు. గుజరాత్‌లో బీజేపీ హిందు వర్సెస్‌ ముస్లిం రాజకీయాల్లో విఫలమైంది. కాంగ్రెస్‌ హిందువులకు వ్యతిరేకం కాదని ప్రజలకు అర్ధమైంది. వాళ్లు రాహుల్‌పై పేల్చిన తుటా తిరిగి వారివైపే పేలింది. కర్ణాటకలో కచ్చితంగా కాంగ్రెస్‌ గెలుస్తుంది’ అని ఆ వ్యక్తి అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement