ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టి.. నిద్రపోయావా?

5 Dec, 2019 13:22 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : కొన్ని రోజులుగా కనుమరుగైన పవన్‌ కల్యాణ్‌ అజ్ఞానంతో మళ్లీ బయటకు వచ్చాడని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య విమర్శించారు. చంద్రబాబు సూచనల మేరకే రోజుకొక ముసుగు ధరించి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉ‍న్నా వైఎస్సార్‌సీపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. గురువారం స్థానికంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ ఇటీవల చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ఖండించారు. చంద్రబాబు బినామీ కల్యాణ్‌, రాజకీయ అజ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టి, టీడీపీ హయాంలో అవినీతి జరుగుతుంటే నిద్రపోయావా? అంటూ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు అనుకూలంగా వామపక్షాలతో కలిసి ప్రచారం చేశారని, ఇప్పుడు ఆయన సూచనలతోనే బీజేపీ చంకనెక్కాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో అభిమానం లేక పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘోర పరాజయం చెందిన నీవు, నీ స్థానం ఏంటో తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.

కులాల మధ్య చిచ్చుకు ప్రయత్నిస్తూ, జగన్‌ రెడ్డి అంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పట్ల అవహేళనగా మాట్లాడతావా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలను అడ్డుపెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది ఎవరని తిరిగి ప్రశ్నించారు. గతంలో ఇంగ్లీష్‌లో ట్వీట్లు పెట్టినప్పుడు తెలుగు చచ్చిపోయిందా? అంటూ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియంపై పవన్‌ చేసిన అనవసర రాద్ధాంతాన్ని కొట్టిపారేశారు. రేపిస్టులకు రెండు చెంప దెబ్బలు చాలని అనడం సిగ్గుచేటని, వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే అవగాహన లోపంతో చేస్తున్నారనేది బయటపడుతుందని అభిప్రాయపడ్డారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా