శ్రీకృష్ణుడికే పంగనామాలు

16 Apr, 2018 06:40 IST|Sakshi
 విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న దేవుడి మాన్యం  

దేవుడి మాన్యం స్వాహా చేసేందుకు యత్నం

పూజారి పేరుతో రికార్డులు తారుమారు

భూములు విక్రయించేందుకు యత్నం

పట్టించుకోని దేవాదాయశాఖ అధికారులు

ఓజిలి : ఆలయ పూజారి తాను పూజించే శ్రీకృష్ణుడికే పంగనామాలు పెట్టి దేవుడి మాన్యం భూములను గుటకాయాస్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. మొత్తం 7.55 ఎకరాల భూమిలో వచ్చే ఫలసాయాన్ని పూజారి ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తూ ఆ భూములను రెవెన్యూ రికార్డుల్లో పేర్లు తారుమారు చేసి విక్రయించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నా దేవదాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. ఓజిలి మండల పరిధిలోని ముమ్మాయపాళెం గ్రామంలో 1947 సంవత్సరంలో శ్రీకృష్ణ మందిరాన్ని గ్రామస్తులు నిర్మించుకున్నారు. అప్పట్లో సర్వేనంబర్‌ 239–2, 246–2లలో 1.66 ఎకరాలు మాగాణి పొలాన్ని గ్రామస్తులు విరాళంగా ఇవ్వగా, ప్రభుత్వం 305–2లో5.89 ఎకరాల మెట్ట భూమిని దేవాలయానికి కేటాయించింది.

అప్పటి నుంచి మందిరంలో ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. ఈ భూములను ఆలయ పూజారికి గ్రామస్తులు అప్పగించారు. భూముల్లో వచ్చే ఫలసాయంతో దేవునికి దీపారాధన జరుగుతుండేది. ఈ క్రమంలో 1995లో మందిరం గాలివానలకు కూలిపోయింది. అప్పటి నుంచి మందిరం మొండిగోడలకు పరిమితమైంది. దేవుడి భూములు మొత్తం శ్రీకృష్ణ మందిరం పేరుతో రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నాయి. గతంలో దేవుడి మాన్యంలో గంగ కాలువ వెళ్లడంతో ప్రభుత్వం రూ.28,500 నగదును పూజారి, కమిటీ పేరుతో మంజూరు చేసింది. అప్పట్లో ఈ నగదును స్వాహా చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. మందిరం భూములపై పూజారి కన్నుపడి అనుకున్నదే తడవుగా గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులకు కాసులు ముట్టజెప్పి రికార్డులను పూజారి పేరుతో మార్పుచేశారు.

దీంతో ఈ భూములను హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ వ్యక్తి సుమారుగా రూ.80 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో పూజారి పొలంపై స్టే తెచ్చేందుకు హైదరాబాద్‌కు వెళ్లిన్నట్లు సమాచారం. ఆలయ భూములను పరిరక్షించాల్సిన దేవాదాయశాఖ అధికారులు మిన్నకుండిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్తులు ఆర్డీఓ శీనానాయక్, తహసీల్దార్‌ సత్యవతిలకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు స్పందించి ఆలయభూములను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

రికార్డులు పరిశీలించి చర్యలు
శ్రీకృష్ణుడి భూముల రికార్డులు తారుమారు జరిగిన విషయం నాదృష్టికి వచ్చింది. గ్రామస్తులు భూముల విషయాన్ని ఫిర్యాదు చేశారు. రెవెన్యూ పత్రాలను పరిశీలించి రికార్డులు తారుమారు చేసిన వారిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. 
– సత్యవతి, తహసీల్దార్, ఓజిలి

భూములు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు
శ్రీకృష్ణ మందిరానికి చెందిన 7.55 ఎకరాల భూములను ఆలయ పూజారి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రెవెన్యూ రికార్డుల్లో శ్రీకృష్ణ మందిరం పేర్లు తొలగించి పూజారి పేరు నమోదు చేసుకున్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు ఆలయం శిథిలావస్థలో ఉంది. ధూప దీప నైవేద్యాలు లేవు. భూములను రూ.80 లక్షలకు విక్రయించేందుకు పూజారి ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాడు. అధికారులు స్పందించి దేవుడి భూములను కాపాడాలి. 
– మామిడి భక్తవత్సలరావు, సర్పంచ్, ముమ్మాయపాళెం

నా దృష్టికి రాలేదు
కృష్ణ మందిరం భూముల విషయం నాదృష్టికి రాలేదు. మందిరం భూముల విషయాన్ని గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. భూములు విక్రయించకుండా చర్యలు చేపడుతాం. 
– రమణారెడ్డి, దేవదాయశాఖ ఈఓ, ఓజిలి

మరిన్ని వార్తలు