ఎనిమిదిలో ఏందిది?

22 Jan, 2018 09:53 IST|Sakshi

లెక్కలురాక.. సైన్స్‌ తెలియక తికమక, మాతృభాషలోనూ అంతంతే

ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల తీరిది

నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలో విస్తుగొలిపిన అంశాలు

పరవాలేదనిపించిన మూడు, ఐదో తరగతుల విద్యార్థులు

సర్కారు బడుల్లోని విద్యార్థుల చదువుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. వారిలో అభ్యసన సామర్థ్యాలు, నైపుణ్యాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (న్యాస్‌) వెల్లడించిన ఫలితాల్లో ఇదే విషయం స్పష్టమైంది. విద్యార్థుల్లో సామర్థ్యాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలోని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి సర్వే చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా గుర్తించిన పాఠశాలల్లో 3, 5, 8వ తరగతి విద్యార్థులను ఎంచుకుంది. గతేడాది నవంబర్‌ 13న నిర్వహించిన ఈ పరీక్షలకు జిల్లా నుంచి 172 పాఠశాలలకు చెందిన 3,354 మంది హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఈ సర్వే ఫలితాలు విస్తుగొలుపుతున్నాయి. 8వ తరగతి విద్యార్థులు సామర్థ్యం దారుణంగా ఉంది.


సాక్షి, రంగారెడ్డి: ఎనిమిదో తరగతి విద్యార్థులు పరీక్షలో కనీస ప్రతిభను ప్రదర్శించలేకపోయారు. మొత్తం నాలుగు అంశాల్లో 60 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయడంలో తీవ్రంగా విఫలమయ్యారు. ముఖ్యంగా గణితంలో చేతులెత్తేశారు. ఈ తరగతి నుంచి 1,207 మంది హాజరవగా కేవలం ఒకే విద్యార్థి 75 శాతానికి పైగా ప్రతిభ కనబర్చాడు. సాంఘిక శాస్త్రంలోనూ పరిస్థితి అంతంతే. ఈ రెండు సబ్జెక్టుల్లో 44 శాతం మంది విద్యార్థులు కనీసం 30 శాతం మార్క్‌ను సైతం దాటలేదు. ఇక సైన్స్‌లోనూ చతికిలపడ్డారు. ఈ మూడు సబ్జెక్టులతో పోల్చితే మాతృభాషలో కాస్త పర్వాలేదనిపించారు. అయినా, సగటు ప్రతిభ 50 శాతం దాటకపోవడం ఆందోళన కలిగిస్తోందని చెప్పవచ్చు.   

సత్తా చాటిన మూడో తరగతి విద్యార్థులు  
మూడో తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఔరా అనిపించారు. సగం మందికిపైగా 75 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించారు. వీరికి మూడు సబ్జెక్టుల్లో 45 ప్రశ్నలు ఇవ్వగా.. అన్ని విషయాల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. సింహభాగం విద్యార్థులు 50 శాతం మార్క్‌ను దాటి తమ అభ్యసన సామర్థ్యాలు భేష్‌ అనిపించారు. ఇక ఐదో తరగతిలోనూ ఓ మాదిరిగా రాణించారు. మూడింట రెండొంతుల మంది చక్కగా ప్రతిభ చాటారు.  

ఇప్పటికైనా మేల్కొంటేనే..
కింది తరగతుల్లోనే విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాలని న్యాస్‌ భావించింది. ఇందులో భాగంగానే సర్వే చేపట్టారు. ఇక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా మరింత పకడ్బందీగా వ్యవహరించి.. విద్యార్థులు పదో తరగతిలో అడుగుపెట్టేలోపు వారి ప్రతిభ మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే, తాజా ఫలితాలను విద్యాశాఖ పరిగణలోకి తీసుకుని విద్యార్థులు మరింత రాణించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

హాజరైన ఎనిమిదో తరగతి విద్యార్థులు: 1207
కేటగిరీల వారీగా ప్రతిభ   
సబ్జెక్టు               30 శాతంలోపు           30% –50%    50%–75%            75 శాతం పైబడి
సాంఘిక శాస్త్రం    530 (43.91%)    425 (35.21%)    252 (20.88%)    
గణితం              545 (45.15%)    406 (33.64%)    255 (21.13%)      1 (0.08%)
సామాన్య శాస్త్రం    447 (37.03%)    524 (43.41%)    227 (18.81%)     9 (0.75%)
తెలుగు              220 (18.23%)    442 (26.62%)    531 (43.99%)     14 (1.16%)


ఎనిమిదో తరగతి విద్యార్థులు..
సబ్జెక్టు    సగటు ప్రతిభ (శాతం)    
సోషల్‌    34.13    
గణితం    34.69    
సైన్స్‌    36.14    
తెలుగు    46.21

సగటు ప్రతిభ (శాతంలో)
సబ్జెక్టు             ఐదో తరగతి    మూడో తరగతి
గణితం            60.64            72.48
పరిసరాల
విజ్ఞానం          59.60             71.55
తెలుగు          60.47             75.31 

మరిన్ని వార్తలు