వర్గీకరణ జరిగేదాకా పోరాటం ఆగదు

1 Feb, 2018 19:38 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న రాగటి సత్యం

సీఎం.. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి

7న కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట ధర్నా 

ఎమ్మార్పీఎస్‌ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాగటి సత్యం

షాద్‌నగర్‌రూరల్‌ : ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో పెట్టి చట్టబద్దత కల్పించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఎమ్మార్పీస్‌ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాగటి సత్యం అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాగటి సత్యం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో పెట్టడానికి జస్టిస్‌ ఉషా మెహ్రా కమిషన్‌ ఇచ్చిన రిపోర్టును ఆమోదింపజేయడానికి సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రిని కలిసి ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. అధికారంలోనికి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ బిల్లును ఆమోదింపజేస్తామని చెప్పిన బీజేపీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు.

 వర్గీకరణ విషయమై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలు హాజరైనా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు హాజరుకాకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోకుంటే సీపీఐ పార్టీ నాయకులు సురవరం సుధాకర్‌ రెడ్డి నాయకత్వంలో అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీకి బయలుదేరే పనిలో ఉన్నామన్నారు. వర్గీకరణ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఫిబ్రవరి 7న తెలుగు రాష్ట్రాల్లోని అన్ని కలెక్టర్‌ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. వర్గీకరణ సాధన కోసం ఎమ్మార్పీఎస్‌ నాయకత్వాన్ని కేంద్ర, రాష్ట్రాలపై యుద్ధానికి సమాయత్తం చేయడానికి జిల్లాలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఫిబ్రవరి 1న షాబాద్‌ మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ సమావేవానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు విధిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి ఫిబ్రవరి 12, 13న హైదరాబాద్‌లో జాతీయ స్థాయి కార్యనిర్వాహక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.  సమావేశంలో ఎమ్మార్పీస్‌ నాయకులు వనం నర్సింహ, మద్దిలేటి, శంకర్‌ రావు, బుర్రా రాంచంద్రయ్య, కట్ట జగన్, నర్సయ్య, చిన్నోళ్ల అనంతయ్య, జోగు మల్లేష్, పెంటనోళ్ల నర్సింలు, శ్రవణ్‌ కుమార్, జోగు శివరాములు, పాండు, యాదగిరి, రవి, రాజు, సురేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు