ట్రాక్టర్ల పంపిణీలో.. పైరవీలు

14 Feb, 2018 16:40 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌ : వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ప్రభుత్వం రైతులకు పనిముట్లతో పాటు ఆధునిక యంత్రాలను రాయితీపై అందజేస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన వారికి సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేసే కార్యక్రమం చేపట్టింది. దీనికోసం ఏటా బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. బడ్జెట్‌ సకాలంలో విడుదల కాని పక్షంలో ట్రాక్టర్‌ షోరూంలతో ఒప్పందం చేసుకుని ముందస్తుగానే వీటిని రైతులకు అందజేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2017– 18 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో జిల్లాకు 166 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. వీటి పంపిణీకి అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్‌ఎస్‌పీ (స్టేట్‌ నార్మల్‌ ప్లాన్‌) కింద 116, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్‌కేవీవై పథకం కింద 50 ట్రాక్టర్లు అందజేయనుంది. ఈ నెల 15వ తేదీ వరకు అర్హులైన వారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు ప్రకటించారు. 

నిబంధనలు... 
 ఎస్సీ, ఎస్టీ రైతులకు 95 శాతం సబ్సిడీపై, బీసీ, ఇతర రైతులకు 50 శాతం రాయితీపై ట్రాక్టర్లు ఇవ్వనున్నారు. ఉదాహరణకు రూ.7 లక్షల విలువచేసే ట్రాక్టర్‌కు బీసీ, ఇతర రైతులు తమ వాటాగా మూడున్నర లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీపై ట్రాక్టర్‌ పొందాలనుకునే రైతు తనకు కనీసం రెండున్నర ఎకరాల భూమి ఉన్నట్లు పాస్‌బుక్‌ (ధ్రువీకరణపత్రం), రుణం ఇచ్చేందుకు బ్యాంకు అంగీకారపత్రం, తహసీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయాధికారుల నుంచి తీర్మానపత్రం పొందాలి. దరఖాస్తులన్నీ పరిశీలించిన తర్వాత అధికారులు అర్హత ఉన్నవారికే ట్రాక్టర్లు అందజేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఆయా మండలాలకు చెందిన ఏఓలకు దరఖాస్తులు అందజేయాలి.
 
సిఫారసులకు ప్రాధాన్యత ఇవ్వొద్దు... 
గతేడాది జిల్లాలో పంపిణీ చేసిన 68 ట్రాక్టర్లలో అధిక శాతం అనర్హులకే దక్కినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఏడాది కూడా ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి సిఫారసు లెటర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అస్మదీయులకు వాహనాలు ఇప్పించడానికి కొంతమంది నేతలు అధికారులకు ఫోన్‌ చేసి ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సారి రైతులను మోసం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఓ పార్టీకి చెందిన నాయకుడు హెచ్చరించారు.  

అర్హులకే అందజేస్తాం 
సబ్సిడీ ట్రాక్టర్ల కోసం అర్హులైన రైతులు ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాకు ఎన్‌ఎస్‌పీ కింద 116, ఆర్‌కేబీవై కింద 50 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. బడ్జెట్‌ ఇంకా విడుదల కాకపోయినా నిబంధనల ప్రకారం గతంలో మాదిరిగానే కంపెనీలతో ముందస్తు ఒప్పందంతో అర్హులకు అందిస్తాం. సిఫారసులు, ఫోన్లు వస్తున్నాయనే ఆరోపణల్లో నిజం లేదు. ఎవరి ఒత్తిడికీ తలొగ్గే ప్రసక్తేలేదు.  నిబంధనల ప్రకారం అర్హులైన వారికే ట్రాక్టర్లు అందజేస్తాం.   
– గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి 

మరిన్ని వార్తలు