ఒక హిందువుగా భయపడుతున్నా : నటి

12 Jul, 2019 12:51 IST|Sakshi

ముంబై పోలీసులు తమ ట్విటర్‌ ఖాతాలో తనను బ్లాక్‌ చేయడంపై బాలీవుడ్‌ నటి పాయల్‌ రోహత్గి విమర్శలు గుప్పించారు. ఓ హిందువుగా హిందుస్థాన్‌లో ఉండాలంటే భయం వేస్తోందన్నారు. ఈ మేరకు... ‘ ముంబై పోలీసులు నన్నెందుకు బ్లాక్‌ చేశారు? డ్రగ్‌ కేసులో జైలుకు వెళ్లిన, మైనారిటీ ట్యాగ్‌ వేసుకున్న నటుడికి మీరు బెస్ట్‌ఫ్రెండా ఏంటి? పోలీసులే ఇలా పక్షపాత ధోరణితో ఉంటే ఒక హిందువుగా హిందుస్థాన్‌లో బతకాలంటే భయంగా ఉంది. హిందువుల కోసం వారి గురించి మాట్లాడవద్దని నా కుటుంబ సభ్యులు ఎందుకు పదే పదే చెబుతారో నాకు ఇప్పుడే అర్థమైంది’ అంటూ ప్రధాని, హోం మంత్రి కార్యాలయాలను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.

ఈ క్రమంలో ముంబై పోలీసుల తీరు పట్ల సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ భార్య అమృత ఫడ్నవిస్‌ పాయల్‌కు అండగా నిలిచారు. ‘ తమ భావాలను పంచుకునే స్వేచ్ఛ ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ప్రభుత్వంలో భాగమైన, ప్రభుత్వ సంస్థలు సామాన్య పౌరులను ఈ విధంగా నిషేధించడం ఎంతవరకు సమంజసం’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగిన ముంబై పోలీస్‌ సోషల్‌ మీడియా టీం...‘ మేడమ్‌..ముంబై పోలీసులు పౌరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. మీరు మాతో ఎల్లప్పుడూ కాంటాక్ట్‌లో ఉండవచ్చు. ముంబైకర్‌లను మేమెన్నడూ నిషేధించలేదు. మీకు ఎదురైన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మా టెక్నికల్‌ టీం ఇందుకు గల కారణాలు అన్వేషిస్తోంది’ అని వివరణ ఇచ్చింది. 

>
మరిన్ని వార్తలు