తెగ నవ్వులు పూయిస్తున్న రాహుల్‌-కురియన్‌ వీడియో

17 Apr, 2019 11:31 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. కేరళలోని పతనం తిట్టలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్‌ పాల్గొన్నారు. తన ప్రసంగాన్ని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, రాజ్యసభ మాజీ డిప్యుటీ ఛైర్‌పర్సన్‌ పీజే కురియన్‌ మళయాలంలోకి అనువదించారు. అయితే రాహుల్‌ గాంధీ ఇం‍గ్లీష్‌లో సీరియస్‌గా ప్రసంగిస్తుంటే మళయాలంలోకి తర్జుమా చేయడానికి కురియన్‌ చాలా సార్లు తడబడ్డారు. 

ఇక అనువాదం సరిగా చేయడం రాకపోవడంతో ఒకానొక సమయంలో కురియన్‌ మైక్‌ను పక్కకు పెట్టి, మళయాలంలో మాట్లాడటానికి ప్రయత్నించారు. అయితే రాహుల్‌ ఆ మైక్‌ని తిరిగి కురియన్‌కి దగ్గరగా జరపడం తెగ నవ్వు తెప్పిస్తుంది. రాహుల్‌ ఆపకుండా ప్రసంగం చేస్తుంటే అది అర్థం చేసుకోవడానికి తరచూ కురియన్‌ చూపించిన హావభావాలు కామెడీని పూయించాయి. రాహుల్‌గాంధీ కూడా కురియన్‌ హావభావాలు చూసి నవ్వుతూ కనిపించారు. అయితే అనువాదంలో తరచూ తడబడుతుండటంతో రాహుల్‌ గాంధీకి ఓపిక నశించి మరొకరితో అనువాదం చేయాలని కోరినట్టు సమాచారం. ప్రసంగం పూర్తయిన తర్వాత ఆయన ఇప్పుడే మళయాలం మాట్లాడటం నేర్చుకుంటున్నాడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతుంది.

మరిన్ని వార్తలు