ఓటమి అంచుల నుంచి... 

2 Jun, 2018 01:08 IST|Sakshi

మ్యాచ్‌ పాయింట్‌ కాపాడుకొని నెగ్గిన రెండో సీడ్‌ జ్వెరెవ్‌

ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్‌

నాలుగో సీడ్‌ దిమిత్రోవ్‌కు షాక్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ  

పారిస్‌: ఒక్క పాయింట్‌ కోల్పోతే టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి నుంచి తేరుకున్న అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌... తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో రెండో సీడ్‌ జ్వెరెవ్‌ 6–2, 3–6, 4–6, 7–6 (7/3), 7–5తో 26వ సీడ్‌ దామిర్‌ జుమ్‌హుర్‌ (బోస్నియా)పై కష్టపడి గెలిచాడు. తన కెరీర్‌లో ఎనిమిదో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతోన్న జ్వెరెవ్‌ తొలిసారి టాప్‌–50లోపు ర్యాంకర్‌ను ఓడించాడు.  3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్‌ నిర్ణాయక ఐదో సెట్‌ పదో గేమ్‌లో మ్యాచ్‌ పాయింట్‌ కాపాడుకున్నాడు. ఆ తర్వాత జుమ్‌హుర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్‌ మొత్తంలో ఎనిమిది ఏస్‌లు సంధించిన జ్వెరెవ్‌... ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు, 73 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం.  
మరోవైపు నాలుగో సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా), పదో సీడ్‌ కరెనో బుస్టా (స్పెయిన్‌) పోరాటం మూడో రౌండ్‌లోనే ముగిసింది. 30వ సీడ్‌ ఫెన్నాండో వెర్దాస్కో (స్పెయిన్‌) 7–6 (7/4), 6–2, 6–4తో దిమిత్రోవ్‌ను... మార్కో చెచినాటో (ఇటలీ) 2–6, 7–6 (7/5), 6–3, 6–1తో కరెనో బుస్టాను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. ఇతర మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–4, 6–7 (6/8), 7–6 (7/4), 6–2తో అగుట్‌ (స్పెయిన్‌)పై, ఏడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 6–3, 6–7 (5/7), 6–3, 6–2తో బెరెటిని (ఇటలీ)పై, 19వ సీడ్‌ నిషికోరి (జపాన్‌) 6–3, 6–1, 6–3తో సిమోన్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.  

స్వితోలినా నిష్క్రమణ 
మహిళల సింగిల్స్‌ విభాగంలో మరో సంచలనం నమోదైంది. నాలుగో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) మూడో రౌండ్‌లో 3–6, 5–7తో మిహెలా బుజర్‌నెస్కూ (రొమేనియా) చేతిలో ఓడిపోయింది. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో రెండో సీడ్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌) 6–0, 6–3తో పౌలిన్‌ పార్మెంటీర్‌ (ఫ్రాన్స్‌)పై, 13వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 6–1, 7–6 (9/7)తో 21వ సీడ్‌ నయోమి ఒసాకా (అమెరికా)పై నెగ్గారు.  

యూకీ, బోపన్నలకు నిరాశ 
డబుల్స్‌ విభాగాల్లో భారత ఆటగాళ్లకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌లో యూకీ బాంబ్రీ–దివిజ్‌ శరణ్‌ ద్వయం 5–7, 3–6తో మరాచ్‌ (ఆస్ట్రియా)–పావిక్‌ (క్రొయేషియా) జంట చేతిలో ఓటమి పాలైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–తిమియా (హంగేరి) జోడీ 2–6, 3–6తో జాన్‌ పీర్స్‌ (ఆస్ట్రేలియా)–షుయె జాంగ్‌ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో దివిజ్‌ (భారత్‌)–షుకో అయోయామ (జపాన్‌) జోడీ 6–2, 3–6, 5–10తో స్రెబోత్నిక్‌ (స్లొవేనియా)–గొంజాలెజ్‌ (మెక్సికో) చేతిలో ఓడింది.

 

>
మరిన్ని వార్తలు