‘వరల్డ్‌ కప్‌లో అతడిని సహజంగా ఆడనివ్వండి’

9 May, 2019 11:47 IST|Sakshi

న్యూఢిల్లీ: అనుభవజ్ఞులు, యువకులతో సమతూకంగా ఉండడమే టీమిండియా బలమని భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ అన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ సత్తా చాటుందని, కోహ్లీ సేన టాప్‌ జట్లలో ఒకటిగా నిలిచే అవకాశముందని చెప్పాడు. ‘యువకులు, అనుభవజ్ఞులతో టీమిండియా సమతూకంగా ఉంది. ధోని, కోహ్లి జట్టులో ఉండటం మరింత కలిసొచ్చే అంశం. భారత్‌ కచ్చితంగా టాప్‌ 4లో నిలుస్తుంది. విజేతగా ఏ జట్టు నిలుస్తుందో ఇప్పుడే చెప్పలేమ’ని కపిల్‌దేవ్‌ పేర్కొన్నాడు. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కచ్చితంగా సెమీస్‌ చేరే అవకాశముందని, నాలుగో బెర్త్‌ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా పోటీ పడే చాన్స్‌ ఉందని అభిప్రాయపడ్డారు.

వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్, వెస్టిండీస్‌ జట్లు ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తాయని కపిల్‌ చెప్పాడు. టీమిండియాకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కచ్చితంగా ప్లస్‌ అవుతాడని, అతడిని అధిక ఒత్తిడికి గురిచేయకుండా సహజంగా ఆడనివ్వాలని సూచించాడు. బుమ్రా, షమీ చక్కగా బౌలింగ్‌ చేస్తున్నారని టీమ్‌లో వీరిద్దరూ కీలకమని కపిల్‌దేవ్‌ తెలిపారు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా జూన్‌ 5న సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

మరిన్ని వార్తలు