భారత్‌ ‘ఎ’ను గెలిపించిన రాయుడు 

24 Aug, 2018 01:00 IST|Sakshi

సిరాజ్‌కు నాలుగు వికెట్లు  

బెంగళూరు: ఫిట్‌నెస్‌ పరీక్ష యో–యోలో అర్హత ప్రమాణాలు అందుకుని బరిలో దిగిన తొలి మ్యాచ్‌లోనే హైదరాబాద్‌ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు (107 బంతుల్లో 62 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అదరగొట్టాడు. అజేయ అర్ధశతకంతో భారత్‌ ‘ఎ’ను గెలిపించాడు. రాయుడితో పాటు బౌలింగ్‌లో సిరాజ్‌ (4/68) రాణించడంతో నాలుగు జట్ల టోర్నీ లో భాగంగా గురువారం జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ ఐదు వికెట్లతో ఆస్ట్రేలియా ‘ఎ’ను ఓడించింది. తొలుత ఆసీస్‌ జట్టు... సిరాజ్, కృష్ణప్ప గౌతమ్‌ (3/31) ధాటికి 31.4 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. అగర్‌ (34) టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ హెడ్‌ (28) ఫర్వాలేదనిపించాడు. ఛేదనలో ఎవాన్‌ రిచర్డ్‌సన్‌ (3/27) దెబ్బకు భారత్‌ ‘ఎ’ 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కృనాల్‌ పాండ్యా (49)తో కలిసి రాయుడు 109 పరుగులు జోడించాడు. దీంతో 38.3 ఓవర్లలోనే జట్టు విజయాన్ని అందుకుంది. 

మనీశ్‌ పాండే కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో... 
ఆలూరులో జరిగిన మరో మ్యాచ్‌లో భారత్‌ ‘బి’ డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’పై నెగ్గింది. మొదట దక్షిణాఫ్రికా ‘ఎ’ 47.3 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. ప్రసిద్ధ్‌ కృష్ణ (4/49), శ్రేయస్‌ గోపాల్‌ (3/42) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. ఛేదనలో మయాంక్‌ అగర్వాల్‌ (7), దీపక్‌ హుడా (4) విఫలమైనా... శుబ్‌మన్‌ గిల్‌ (42)తో కలిసి కెప్టెన్‌ మనీశ్‌ పాండే (95 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) మూడో వికెట్‌కు 88 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. శుబ్‌మన్‌ ఔటయ్యాక కేదార్‌ జాదవ్‌ (23), ఇషాన్‌ కిషన్‌ (24) అండగా ముందుకు నడిపించాడు. జట్టు స్కోరు 40.3 ఓవర్లలో 214/5 పరుగుల వద్ద ఉండగా వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్‌ పద్ధతిలో భారత్‌ ‘బి’ గెలుపొందినట్లు ప్రకటించారు. 

కోహ్లి మళ్లీ నం.1 
టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్ర స్థానానికి చేరుకున్నాడు. ఈసారి కెరీర్‌ అత్యుత్తమ (937) పాయింట్లతో అతడు ఆ ఘనతను అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో రాణించి... 934 పాయింట్లతో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (929)ను వెనక్కునెట్టి తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచాడు. కానీ, రెండో టెస్టులో విఫలమవడంతో ఆ స్థానం చేజారింది. తాజాగా ముగిసిన మూడో టెస్టులో అద్వితీయంగా ఆడటంతో విరాట్‌ మళ్లీ టాప్‌లోకి వచ్చాడు. మరోవైపు భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా 51వ స్థానంలో, పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా 37వ ర్యాంకులో ఉన్నాడు. 

మరిన్ని వార్తలు