రాయుడు రిటైర్మెంట్‌.. కోహ్లిపై నెటిజన్స్‌ ఫైర్‌!

4 Jul, 2019 09:28 IST|Sakshi

తెలుగుతేజం అంబటి తిరుపతి రాయుడు ఆవేదనతో తన ఆటను ముగించిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండుసార్లు తాజా ప్రపంచ కప్‌ జట్టులో స్థానం ఆశించి భంగపడిన అతను బుధవారం అనూహ్యంగా తన రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్‌లు, అన్ని స్థాయిల ఆటకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. నిలకడగా రాణించినా తనపై సెలక్షన్‌ కమిటీ నమ్మకముంచకపోవడం.. 2019 వరల్డ్‌ కప్‌ వరకు రాయుడికి అండగా నిలవాలంటూనే సారథి విరాట్‌ కోహ్లి మాట నిలబెట్టుకోకపోవడం.. గాయంతో ఇద్దరు ఆటగాళ్లు జట్టు నుంచి తప్పుకున్నా.. తనను పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన రాయుడు ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాయుడు రిటైర్మెంట్‌ నేపథ్యంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. 

2018 ఆసియా కప్‌ ముగిసిన అనంతరం కోహ్లి రాయుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్‌లను షేర్‌ చేస్తూ.. అతన్ని తప్పుబడుతున్నారు. ‘2019 వరల్డ్‌ కప్‌ వరకు రాయుడికి మేం అండగా నిలవాల్సిన అవసరముంది’ అని నాడు బహాటంగా కోహ్లి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబరులో ‘నాలుగో స్థానానికి సరైనవాడు’ అంటూ ప్రశంసించిన కోహ్లి.. ఆ మూడు నెలలకే మాట మార్చి.. నాలుగో స్థానం ఇంకా ఖరారు కాలేదంటూ కొత్త చర్చను లేవనెత్తడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రాయుడి రిటైర్మెంట్‌కు పరోక్షంగా కోహ్లినే కారణమని, రాయుడిని ఇలా అవమానకరంగా క్రికెట్‌నుంచి వైదొలిగేలా చేయడం బాధ కలిగిస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. రాయుడి రిటైర్మెంట్‌కు కోహ్లియే కారణమని, అతను రాజకీయాల్లోకి చేరితే బాగుంటుందని ఒక నెటిజన్‌ వ్యాఖ్యానించగా.. ప్రతిభావంతుడైన ఆటగాడికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది.. ఈ విషయంలో చీప్‌ రాజకీయాలు చేయడం తగదని మరొక నెటిజన్‌ బీసీసీఐని తప్పుబట్టారు. తనకు భజన చేసే క్రికెటర్లను మాత్రమే కోహ్లి ప్రోత్సహిస్తాడని, అశ్విన్‌, జడేజా, అంబటి రాయుడు కెరీర్‌ను కోహ్లియే నాశనం చేశాడని, ఆర్సీబీలో తనతోపాటు ఆడుతున్నందుకే చాహల్‌, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లకు అవకాశాలు కల్పిస్తున్నాడని మరో నెటిజన్‌ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు