కన్నీళ్లతో టెన్నిస్‌కు ముర్రే వీడ్కోలు!

12 Jan, 2019 02:00 IST|Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆఖరి టోర్నీ

గాయాలే కారణమన్న బ్రిటన్‌ స్టార్‌   

మెల్‌బోర్న్‌: సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న తుంటి గాయంతో బ్రిటన్‌ స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్, మాజీ వరల్డ్‌ నంబర్‌వన్‌ ఆండీ ముర్రే కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసిపోతోంది. టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు 31 ఏళ్ల ముర్రే శుక్రవారం ప్రకటించాడు. సోమవారం ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత తాను రిటైర్‌ అవుతున్నట్లు అతను చెప్పాడు. సొంతగడ్డపై ఈ ఏడాది వింబుల్డన్‌ ఆడిన తర్వాత గుడ్‌బై చెప్పాలనుకున్నానని, అయితే అప్పటి వరకు తాను నొప్పితో ఆడలేనని అన్నాడు. రిటైర్మెంట్‌ ప్రకటన సందర్భంగా ముర్రే కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ‘తుంటి గాయం చాలా బాధపెడుతోంది. ఏదోలా ఓర్చుకుంటూ కొంత వరకు ఆడగలనేమో. కానీ అంత సహనంతో బాధను భరిస్తూ ప్రాక్టీస్‌లో గానీ పోటీల్లో గానీ శ్రద్ధ పెట్టలేకపోతున్నా. కాబట్టి ఇదే నా ఆఖరి టోర్నీ కావచ్చు’అని ముర్రే  వ్యాఖ్యానించాడు.  

ఇంగ్లీష్‌ హీరో... 
1936లో ఫ్రెడ్‌ పెర్రీ వింబుల్డన్‌ గెలిచిన తర్వాత బ్రిటన్‌ అభిమానులు మళ్లీ టైటిల్‌ సాధించే తమ దేశపు ఆటగాడి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు 2013లో సొంతగడ్డపై వింబు ల్డన్‌ గెలిచి ముర్రే 77 ఏళ్ల కల నెరవేర్చాడు. మరో మూడేళ్లకు 2016లో కూడా ముర్రే ఇదే టైటిల్‌ నెగ్గాడు. ఈ రెండింటికంటే ముందు 2012లో గెలిచిన యూఎస్‌ ఓపెన్‌ అతని ఖాతాలో ఉన్న మూడో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో (2012, 2016) అతను స్వర్ణపతకం గెలుచుకొని ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 2016 నవంబర్‌ 7 నుంచి వరుసగా 37 వారాల పాటు వరల్డ్‌ నంబర్‌వన్‌గా కొనసాగిన రికార్డు ముర్రే సొంతం. మొత్తం 45 ఏటీపీ టైటిల్స్‌ అతని ఖాతాలో ఉన్నాయి.    

మరిన్ని వార్తలు