LLC 2023 BK Vs GG: మళ్లీ మొదలెట్టిన క్రిస్‌ గేల్‌.. అవకాశం వచ్చినా సెంచరీ చేయలేకపోయిన సిమన్స్‌

23 Nov, 2023 11:10 IST|Sakshi

విండీస్‌ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ చాలాకాలం తర్వాత మళ్లీ బ్యాట్‌ ఝులిపించాడు. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ 2023 సీజన్‌లో భాగంగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్‌ సెంచరీ చేశాడు. ఈ టోర్నీలో గుజరాత్‌ జెయింట్స్‌కు ఆడుతున్న గేల్‌.. భిల్వారా కింగ్స్‌తో నిన్న (నవంబర్‌ 22) జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు.

ఫలితంగా గుజరాత్‌ జెయింట్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తూ 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. జెయింట్స్‌ ఇన్నింగ్స్‌లో రిచర్డ్‌ లెవి (28), అభిషేక్‌ ఝున్‌ఝున్‌వాలా (24), ఖురానా (24 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. జాక్‌ కలిస్‌ (14), కెవిన్‌ ఓబ్రెయిన్‌ (11), కెప్టెన్‌ పార్థివ్‌ పటేల్‌ (8) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. భిల్వారా బౌలర్లలో రాహుల్‌ శర్మ, జెసల్‌ కరియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. బార్న్‌వెల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

ఒక్క పరుగుతో సెంచరీ మిస్‌..  
గుజరాత్‌ నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కింగ్స్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమై 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కింగ్స్‌ ఇన్నింగ్స్‌లో లెండిల్‌ సిమన్స్‌ (61 బంతుల్లో 99 నాటౌట్‌; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. కింగ్స్‌ గెలవాలంటే ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా సిమన్స్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు.

కనీసం రెండు పరుగులు చేయగలిగినా సిమన్స్‌ సెంచరీ పూర్తి చేసుకునే వాడు. కింగ్స్‌ ఇన్నింగ్స్‌లో తిలకరత్నే దిల్షన్‌ (1), యూసఫ్‌ పఠాన్‌ (5), కెప్టెన్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జెయింట్స్‌ బౌలర్లలో రయాద్ ఎమ్రిట్‌, ఈశ్వర్‌ చౌదరీ చెరో 2 వికెట్లు, శ్రీశాంత్‌, లడ్డా, రజత్‌ భాటియా తలో వికెట్‌ దక్కించుకున్నారు. టోర్నీలో భాగంగా ఇవాళ (నవంబర్‌ 23) ఇండియా క్యాపిటల్స్‌, అర్బన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. 

మరిన్ని వార్తలు