ఆసీస్‌తో తొలి టీ20కి ముందు టీమిండియా కొత్త కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కామెంట్స్‌

23 Nov, 2023 09:00 IST|Sakshi

వైజాగ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ20 ముందు టీమిండియా కొత్త కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అతను వరల్డ్‌కప్‌ అనుభవాలను పంచుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం బాధాకరమని అన్నాడు. వరల్డ్‌కప్‌లో తమ ప్రయాణం అద్భుతంగా సాగిందని తెలిపాడు. ఫైనల్లో ఓడినప్పటికీ తమ ప్రదర్శన యావత్‌ భారత దేశానికి గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నాడు.

పైనల్లో ఎదురైన చేదు అనుభవాన్ని మరచిపోయి ముందుకు సాగాలని అనుకుంటున్నామన్నాడు. వరల్డ్‌కప్‌లో రోహిత్‌ శర్మ టీమిండియాను అద్భుతంగా ముందుండి నడిపించాడని కితాబునిచ్చాడు. హిట్‌మ్యాన్‌ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డే వరల్డ్‌ ఛాంపియన్లను ఢీకొట్టేందుకు కుర్రాళ్లు ఉత్సాహంగా ఉన్నారని తెలిపాడు.

రోహిత్‌ లాగే తాను కూడా జట్టుకు ఉపయోగపడే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటానని వివరించాడు. వ్యక్తిగతంగా మైలురాళ్లను ఇష్టపడే వ్యక్తిని కాదని పేర్కొన్నాడు. సిరీస్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ.. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌ దృష్ట్యా ఈ సిరీస్‌ చాలా కీలకమని తెలిపాడు. నిర్భయంగా, నిస్వార్ధంగా, జట్టు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆడమని సభ్యులతో చెప్పానని అన్నాడు.  ఇటీవలికాలంలో జరిగిన దేశవాళీ టోర్నీల్లో, ఐపీఎల్లో వారు అదే చేశారని తెలిపాడు. కాగా, వైజాగ్‌ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు భారత్‌-ఆసీస్‌ మధ్య తొలి ట20 జరుగనున్న విషయం తెలిసిందే.

తుది జట్లు (అంచనా) 
భారత్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్ ), ఇషాన్‌ కిషన్, యశస్వి/రుతురాజ్, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, రింకూ సింగ్, అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్‌ సింగ్, ప్రసిధ్‌ కృష్ణ, ముకేశ్‌ కుమార్‌.  
ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్‌ (కెప్టెన్ ), స్మిత్, షార్ట్, హార్డీ, ఇన్‌గ్లిస్, స్టొయినిస్, టిమ్‌ డేవిడ్, సీన్‌ అబాట్, ఎలిస్, బెహ్రన్‌డార్ఫ్‌, తన్విర్‌ సంఘా.

మరిన్ని వార్తలు