సెరెనా వచ్చింది... అయితే నాకేంటి!

3 Jun, 2019 06:06 IST|Sakshi

ఆమె వస్తే... నేను ముగించాలా?

నిర్వాహకులపై థీమ్‌ ఆగ్రహం

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ నిర్వాహకుల అత్యుత్సాహంపై ఆస్ట్రియా స్టార్‌ డొమినిక్‌ థీమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఓ స్టార్‌ క్రీడాకారిణి వచ్చినంత మాత్రాన నా మీడియా సమావేశాన్ని మధ్యలోనే ముగించుకొని వెళ్లాలా’ అని తీవ్ర స్థాయిలో నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే... నాలుగో సీడ్‌ థీమ్‌ మూడో రౌండ్‌ గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరాడు. మ్యాచ్‌ అనంతరం ప్రధాన మీడియా హాల్‌లో అతను విలేకర్లతో ముచ్చటిస్తున్నాడు. మరోవైపు అమెరికన్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ మూడో రౌండ్లో ఓడిపోయింది. మీడియా సమావేశం కోసం ఆ హాల్‌ దగ్గర వేచి ఉంది. దీంతో 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత సెరెనా కోసం నిర్వాహకులు... థీమ్‌ విలేకర్లతో ముచ్చటిస్తుంటే త్వరగా ముగించుకొని వెళ్లాలని అత్యుత్సాహం ప్రదర్శించారు.

వెంటనే థీమ్‌ దీటుగా స్పందిస్తూ ‘ఏంటీ జోకా... ఆమె వచ్చిందని నన్ను ఉన్న పళంగా హాల్‌ ఖాళీ చేసి వెళ్లమంటారా? ఏంటి ఈ చోద్యం. నేను ముగించను. ఇక్కడి నుంచి వెళ్లను. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని తీవ్ర స్థాయిలో స్పందించాడు. విషయం తెలుసుకున్న సెరెనా తనకు ప్రధాన హాల్‌ లేకపోయినా పర్లేదు ఏదో గదిలో మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్వాహకులతో చెప్పింది. దీనిపై పలువురు దిగ్గజాలు, మాజీ ఆటగాళ్లు థీమ్‌ను వెనకేసుకొచ్చారు. మాజీ చాంపియన్‌ ఫెడరర్‌ మాట్లాడుతూ ‘థీమ్‌ అసహనానికి అర్థముంది. ఆగ్రహం వ్యక్తం చేయడానికి హక్కూ వుంది’ అని అన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు