అర్జున్‌ టెండూల్కర్‌ బోణీ కొట్టాడు..

17 Jul, 2018 17:12 IST|Sakshi

కొలంబొ: టీమిండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ వారసుడు అర్జున్‌ టెండూల్కర్‌ తన అంతర్జాతీయ తొలి వికెట్‌ను సాధించాడు. శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనున్న భారత అండర్‌-19 జట్టులో అర్జున్‌ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. మంగళవారం శ్రీలంకతో తొలి టెస్టులో భాగంగా భారత్‌ తరపున​ ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్‌ చేపట్టింది. టీమిండియా అండర్‌-19 సారథి అనుజ్‌ రావత్‌ బౌలింగ్‌ దాడి అర్జున్‌తో ప్రారంభించాడు. తొలి ఓవర్‌లో ఒక ఫోర్‌తో సహా ఆరు పరుగులిచ్చిన ఈ పేసర్‌ తన తరువాతి ఓవర్‌లో లంక ఓపెనర్‌ ఆర్‌వీపీకే మిశ్రా (9) వికెట్‌ సాధించాడు. దీంతో అర్జున్‌ టెండూల్కర్‌ తన తొలి అంతర్జాతీయ వికెట్‌ సాధించాడు. ఇక మిగతా బౌలర్లు హర్ష్‌ త్యాగి (4/92), ఆయూష్‌ బడొని (4/24) చెలరేగడంతో లంక తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అర్జున్‌ 33 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ సాధించాడు.    

వినోద్‌కాంబ్లి అనందభాష్పాలు
అర్జున్‌ టెండూల్కర్ తొలి వికెట్‌ సాధించడం పట్ల టీమిండియా మాజీ ఆటగాడు, సచిన్‌ బాల్య స్నేహితుడు వినోద్‌ కాంబ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ యువ ఆటగాడికి శుభాకాంక్షలు తెలపుతూ భావోద్వేగంగా ట్వీటర్‌లో ట్వీట్‌ చేశాడు. ‘అర్జున్‌ వికెట్‌ తీయడం చూసి ఆనందభాష్పాలతో నా నోట మాట రావడం లేదు.  నీ ఆట చూస్తుంటే నువ్వు పడిన కష్టం కనబడుతోంది. ఈ వికెట్‌తోనే సంతోషపడకు.. ఇది కేవలం ప్రారంభమాత్రమే. నువ్వు సాధించాల్సిన విజయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. తొలి వికెట్‌ ఆనందాన్ని ఆస్వాదించు’ అంటూ కాంబ్లీ ట్వీట్‌ చేశాడు.
 

మరిన్ని వార్తలు