దయచేసి అవమానించకండి: క్రికెటర్‌ దిండా ఆవేదన

26 Apr, 2019 13:54 IST|Sakshi
అశోక్‌ దిండా

బెంగళూరు : భారత పేసర్‌ అశోక్‌ దిండాను హేళన చేస్తూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తన అధికారిక ట్విటర్‌లో చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ జట్టు మాజీ ఆటగాడైన దిండా.. ఆర్సీబీకి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉమేశ్‌ను కొనియాడే క్రమంలో ఆర్సీబీ దిండాను హేళన చేసింది. దిండా అకాడమియే ఏం జరిగిందంటూ? క్యాప్షన్‌గా ఉమేశ్‌ ఫొటోను ట్వీట్‌ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ ట్వీట్‌ను తొలిగించింది.

ఆర్సీబీ ట్వీట్‌, ట్రోల్స్‌తో విసిగిపోయిన దిండా.. తన కెరీర్‌లో అందుకున్న ఘనతలను గుర్తు చేశాడు. ‘హేటర్స్‌.. నా ఈ లెక్కలు చూడండి. నాపై అనవసరంగా నోరుపారేసుకోవడం ఆపండి. మీ నోటి నుంచి నా పేరు రానివ్వకండి’ అని తాను నమోదు చేసిన గణంకాలను జత చేశాడు. గత 9 సీజన్లుగా బెంగాల్‌ రంజీ జట్టు తరఫున తానే ఎక్కవ వికెట్లు తీసానని, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో మొత్తం 400 వికెట్లు పడగొట్టానని తెలిపాడు. ఇక ఆర్సీబీ సైతం దిండా విషయంలో చేసిన ట్విట్‌పై వివరణ ఇచ్చింది. ‘ మీరు చెప్పినట్లు మేం చేసిన ఆ ట్వీట్‌ బాలేదు. మీరందరూ ఉమేశ్‌పై ట్రోలింగ్‌కు దిగారు. అతను వాటిని సవాల్‌గా స్వీకరించి (3/36) అదరగొట్టాడు. చివరి ఓవర్లో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.’ అని మరో ట్వీట్‌ చేసింది.

ఇక దిండా మాత్రం ఈ ట్రోలింగ్‌పై తన ఆవేదనను సుదీర్ఘ పోస్టుద్వారా వ్యక్తం చేశాడు. ‘ ఈ ప్రపంచంలో నేను అంత గొప్ప బౌలర్‌ కాదని తెలుసు. కానీ ఆ ప్రపంచానికి తెలియనిదేంటంటే.. నేను క్రికెటర్‌ కావడానికి పడ్డ కష్టం. నేను క్రికెటర్‌ను అవుతానంటే నా కుటుంబం అంగీకరించలేదు. మద్దతుగా నిలవలేదు. 9 ఏళ్ల వయసులోనే బెంగాల్‌ జట్టు తరఫున ఆడాలని కష్టపడ్డాను. ఎన్నో రోజులు ఆహారం లేకుండా క్రికెట్‌ మైదానాల్లో పడుకున్నాను. నాకు మద్దతివ్వడం మీకు ఇష్టం లేకుంటే వదిలేయండి. కానీ నా ఆటను మాత్రం అవమానించకండి. ఎందుకంటే క్రికెట్‌ ఆడటానికి రేయింబవళ్లు ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు.’  అని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. భారత జట్టు తరఫున 13 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన దిండా 12 వికెట్లు పడగొట్టాడు. 9 టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. 
 

>
మరిన్ని వార్తలు