తొలి వన్డేలో భారత్‌ పరాజయం

12 Mar, 2018 16:52 IST|Sakshi

వడోదరా: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో ఇక్కడ సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళలు 8 వికెట్ల తేడాతో పరాజయం చెందారు. భారత్‌ జట్టు పేలవంగా ఆడి ఓటమిని చవిచూడగా,ఆస్ట్రేలియా సమష్టిగా ఆడి శుభారంభం చేసింది. భారత్‌ నిర్దేశించిన 201 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆసీస్‌ 32.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్‌ ఓపెనర్‌ నికోల్‌ బాల్టన్‌(100 నాటౌట్‌; 101 బంతుల్లో 12 ఫోర్లు) అజేయ శతకంతో రాణించి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఆమెకు జతగా అలీస్సా హేలీ(38), మెగ్‌ లాన్నింగ్‌(33), ఎల్సీ పెర్రీ(25 నాటౌట్‌)లు సమయోచితంగా బ్యాటింగ్‌ చేయడంతో ఆసీస్‌ ఘన విజయం సాధించింది.

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత మహిళా జట్టు 50 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. పూనమ్‌ రౌత్‌(37), సుష్మా వర్మ(41), పూజా వస్ట్రాకర్‌(51)లు మాత్రమే ఆకట్టుకోవడంతో భారత జట్టు స్పల్ప స్కోరుకే పరిమితమైంది. ఆసీస్‌ బౌలర్లలో జోనాసన్‌ నాలుగు వికెట్లు, వెల్లింగ్టన్‌ మూడు వికెట్లు సాధించారు.

మరిన్ని వార్తలు