విశ్వ విజేత ఆస్ట్రేలియానే

30 Mar, 2015 23:36 IST|Sakshi
విశ్వ విజేత ఆస్ట్రేలియానే

మెల్ బోర్న్:మరోసారి ఆస్ట్రేలియా విశ్వ విజేతగా అవతరించింది. క్రికెట్ లో తమకు తిరుగులేదని నిరూపిస్తూ ఆసీస్ ఐదోసారి వరల్డ్ కప్ ను చేజిక్కించుకుంది. ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచకప్ ను కైవశం చేసుకుంది. న్యూజిలాండ్ విసిరిన 184 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆదిలోనే ఓపెనర్ ఆరోన్ ఫించ్ డకౌట్ గా వెనుదిరిగినా.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(45)పరుగులతో ఆకట్టుకున్నాడు. వార్నర్ వెనుదిరిగిన అనంతరం స్టీవ్ స్మిత్ కు జత కలిసిన మైకేల్ క్లార్క్ బాధ్యతాయుతంగా ఆడాడు.

 

అయితే విజయానికి మరో 9 పరుగులు కావాల్సిన తరుణంలో క్లార్క్(74) పెవిలియన్ కు చేరాడు.  ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ మార్కును చేరిన స్మిత్ (56*) మిగతా పనిని పూర్తి చేశాడు. ఆసీస్ టాప్ ఆర్డర్ రాణించడంతో లక్ష్యాన్ని 33.1 ఓవర్లలో చేరుకుని కివీస్ కు షాకిచ్చింది. న్యూజిలాండ్ బౌలర్లలో  హెన్రీకి రెండు వికెట్లు దక్కగా, బౌల్ట్ కు ఒక వికెట్ లభించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 45.0 ఓవర్లలో 183 పరుగులకే చాప చుట్టేసింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో గ్రాంట్ ఇలియట్(83), రాస్ టేలర్(40) పరుగులు మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఆరుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.

 

దుమ్ములేపిన ఆసీస్ పేస్


ఈ మెగా ఈవెంట్ లో ఇరు జట్లు బలబలాలు సమానంగా ఉన్నా.. కీలక పోరుకు వచ్చేసరికి ఆసీస్ ప్రత్యేకంగా తన పేస్ తో కివీస్ దుమ్ముదులిపింది. ఫైనల్ మ్యాచ్ మొదలైన అనంతరం కివీస్ ఆటగాళ్లను కోలుకోనీయకుండా చేసి తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో ఆసీస్ సఫలం అయ్యింది.  ప్రధానంగా మిచెల్ జాన్సన్, ఫాల్కనర్, స్టార్క్ లు బౌలింగ్ చెలరేగి కివీస్ పతనాన్ని శాసించారు. ఈ ముగ్గురు కలిసి ఎనిమిది కివీస్ వికెట్ల నేలకూల్చడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు