దినేశ్‌ కార్తీక్‌కు ఊరట

16 Sep, 2019 15:32 IST|Sakshi

ముంబై: తనను క్షమించాలంటూ ఇటీవల భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)ని కోరిన క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌కు ఊరట లభించింది.  ఇటీవల నిబంధనలను ఉల్లంఘించిన దినేశ్‌ కార్తీక్‌ వెంటనే క్షమాపణలు  తెలపడంతో దీనికి ముగింపు పలకాలనుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దినేశ్‌ కార్తీక్‌  బేషరతుగా క్షమాణలు తెలియజేసిన నేపథ్యంలో అందుకు బీసీసీఐ అంగీకరించినట్లు బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ‘ దినేశ్‌ కార్తీక్‌ క్షమాపణలు చెప్పాడు. ఈ వివాదం ఇక ముగిసిన అధ్యాయం’ అని సదరు అధికారి పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం బీసీసీఐ అనుమతి లేకుండానే కరీబియన్‌ లీగ్‌(సీపీఎల్‌) మ్యాచ్‌లను వీక్షించేందుకు వెళ్లిన కార్తీక్‌.. అక్కడ ట్రిన్‌బాగో జట్టు జెర్సీ ధరించి.. ఆ జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూర్చున్నాడు.ట్రిన్‌బాగో జట్టు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ది కావడం..  అతని యాజమాన్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్‌లో దినేశ్‌ కార్తీక్‌ సారథిగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా సీపీఎల్‌ జట్టు డ్రెసింగ్‌ రూమ్‌లో కార్తీక్‌ కనిపించడంతో అతని కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఈ క‍్రమంలోనే తాను చేసిన తప్పును తెలుసుకున్న కార్తీక్‌ బోర్డుకు క్షమాపణలు తెలియజేశాడు.

మరిన్ని వార్తలు