‘సుప్రీం’లో బీసీసీఐ ముసాయిదా

31 Oct, 2017 00:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎట్టకేలకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముసాయిదా సుప్రీం కోర్టుకు చేరింది. బోర్డులో పారదర్శక పాలన కోసం జస్టిస్‌ ఆర్‌.ఎమ్‌.లోధా ప్యానెల్‌ సూచించిన పలు కీలక సిఫార్సులతో సిద్ధమైన ముసాయిదాను సోమవా రం సీల్డ్‌ కవర్‌లో సుప్రీం కోర్టుకు అందజేశారు. బోర్డు నియమావళి ముసాయిదాను రూపొందించడంలో తాత్సారం చేయడంపై ఆగ్రహించిన అత్యున్నత న్యాయస్థానం 30న స్వయంగా హాజరు కావాలని బీసీసీఐ ఉన్నతాధికారులు సీకే ఖన్నా, అమితాబ్‌ చౌదరి, అనిరుధ్‌ చౌదరిలకు గతంలో సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీరంతా సోమవారం చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఏఎమ్‌ ఖాన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్యబెంచ్‌ ముందు హాజరయ్యారు.

దీంతో వచ్చే నెల 29న జరిగే తదుపరి విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. లోధా ప్యానెల్‌ సిఫారసులను బోర్డు పెద్దలు ఇప్పటివరకు అమలు చేయలేదు. దీనిపై కన్నెర్రజేసిన సుప్రీం... వీటిని బీసీసీఐ నియమావళిలో చేర్చాల్సిందేనని ఆదేశించింది. కోర్టు నియమించిన పరిపాలక కమిటీ (సీఓఏ) ముసాయిదాకు చొరవ చూపాలని మార్గదర్శనం చేయడంతో ఎట్టకేలకు దీన్ని సుప్రీం కోర్టులో సీల్డ్‌ కవర్‌లో అందజేశారు.  

మరిన్ని వార్తలు