లీగ్‌లో సొంత ఆటగాళ్లనే ఆడించండి!

5 Jul, 2018 01:37 IST|Sakshi

రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు బీసీసీఐ ఆదేశం  

ముంబై: దేశంలో వేర్వేరు రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు నిర్వహిస్తున్న లీగ్‌ టోర్నీలపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇష్టారాజ్యంగా వాటిని నిర్వహించేందుకు వీలు లేకుండా కొత్త నిబంధనలు రూపొందించింది. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్, కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌ ఇప్పటికే సూపర్‌ సక్సెస్‌ కాగా... కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం కూడా బోర్డు అనుమతితో తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ను నిర్వహించింది. ఇకపై అసోసియేషన్‌ పరిధిలోని ఆటగాళ్లతోనే ఈ లీగ్‌ను నిర్వహించాలని, కోచ్‌లు, సహాయక సిబ్బంది సహా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటివారితో ఒప్పందం చేసుకోరాదని స్పష్టం చేసింది.

అవినీతి కార్యకలాపాలకు అవకాశం లేకుండా కచ్చితంగా ఏసీయూ నిబంధనలు పాటించాలని, జట్టు యజమానులకు ‘మెంటర్‌’, ‘కోచ్‌’లాంటి పేర్లతో ఆటగాళ్లు ఉండే ప్రాంతానికి సంబంధించి అక్రిడేషన్లు ఇవ్వరాదని కూడా ఆదేశించింది. ఆటగాళ్లకు 30 వేల రూపాయలకు మించిన బహుమతులు ఏమైనా వస్తే వెంటనే తెలియజేయాలని కూడా పేర్కొంది. దీంతో పాటు ఎప్పుడు పడితే అప్పుడు లీగ్‌ను కొనసాగించకుండా కచ్చితమైన తేదీలు పాటించాలని కూడా చెప్పింది.    
 

మరిన్ని వార్తలు