బైక్ మెకానిక్ కుమారుడు... బాక్సింగ్‌లో ఘనుడు

22 Apr, 2014 00:34 IST|Sakshi
బైక్ మెకానిక్ కుమారుడు... బాక్సింగ్‌లో ఘనుడు

విశాఖపట్నం, న్యూస్‌లైన్: సాధారణ బైక్ మెకానిక్ కుమారుడు, వేసవి సెలవుల్లో స్థానికంగా నిర్వహించిన శిబిరాల్లో శిక్షణ పొందిన బాలుడు.. నేడు అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్‌లో పతకం సాధించే స్థాయికి ఎదిగాడు. తన పదునైన పంచ్‌లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించి, తొలిరౌండ్‌లోనే బౌట్‌ను నిలిపివేసేలా సంచలన ప్రదర్శన కనబరిచిన ఆ యువకుడే విశాఖపట్నానికి చెందిన కాకర శ్యామ్ కుమార్.

 ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో అద్భుతంగా రాణిస్తూ సెమీఫైనల్‌కు చేరిన శ్యామ్‌కుమార్‌ది విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రాంతం. స్థానికంగా బైక్ మెకానిక్‌గా పనిచేసే కాకర అర్జున్ నలుగురు సంతానంలో మూడోవాడు శ్యామ్. తాను పదో తరగతి చదువుతున్నప్పుడు తన అన్నయ్య బాక్సింగ్ పంచ్‌లు విసురుతుంటే చూసి తానూ బాక్సర్‌ను కావాలనుకున్నాడు.

అతని ఆసక్తిని గమనించిన తండ్రి.. శ్యామ్‌ను స్థానిక సాయ్ శిక్షణ కేంద్రంలో చేర్పించాడు. అక్కడ కోచ్ వెంకటేశ్వరరావు శిక్షణలో మెళకువలు నేర్చిన శ్యామ్.. శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్స్‌లో ఫ్లయ్ వెయిట్‌లో స్వర్ణం సాధించాడు. అనంతరం మహారాష్ట్రలో జూనియర్ నేషనల్స్‌లో రజతం, ఆలిండియా సాయ్ హాస్టల్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుపొందాడు.

  అదే ఏడాది కజకిస్తాన్‌లో జూనియర్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 46 కేజీల విభాగంలో, అజర్‌బైజాన్‌లో జూనియర్స్ అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నాడు. 2012లో అకోలాలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్‌లో స్వర్ణం నెగ్గాడు.

 గత ఏడాది డిసెంబర్‌లో  జరిగిన అంతర్జాతీయ యూత్  టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. గత మూడు నెలలు ఔరంగాబాద్‌లోని జాతీయ శిబిరంలో శిక్షణ పొందిన శ్యామ్... నేరుగా ఏఐబీఏ యూత్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న శ్యామ్ యూత్ ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

మరిన్ని వార్తలు