క్రికెటర్‌ ఖవాజా సోదరుడు అరెస్ట్‌

4 Dec, 2018 12:33 IST|Sakshi

సిడ్నీ: ఆసీస్‌ క్రికెటర్‌ ఉస్మాన్ ఖవాజా సోదరుడు అర్సకాన్ ఖవాజాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాముదీన్ అనే వ్యక్తిని అన్యాయంగా ఉగ్రవాదానికి సంబంధించిన కేసులో ఇరికించాడన్న ఆరోపణలపై ఖవాజాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మాజీ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ హత్యకు నిజాముదీన్ కుట్ర పన్నాడని ఖవాజా ఆరోపించాడు. అదే తరహాలో పోలీసులను నమ్మించాడు. దీంతో ఆగస్టులో నిజాముదీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధం లేదని తేలడంతో అతన్ని విడుదల చేశారు.

అన్యాయంగా ఓ అమాయకుడిని అరెస్ట్ చేసినందుకు చింతిస్తూ.. అతని కోర్టు ఖర్చులను పోలీసులే చెల్లించారు. వ్యక్తిగత కక్షతోనే అర్సకాన్ ఖవాజా.. నిజాముదీన్‌ను ఈ కేసులో ఇరికించాడని న్యూ సౌత్ వేల్స్ అసిస్టెంట్ కమిషనర్ మిక్ విల్లింగ్ వెల్లడించారు.యువతి విషయంలో ఈ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఖవాజా.. ఇలా అన్యాయంగా నిజాముదీన్‌ను ఇరికించినట్లు తేలింది. దీంతో మంగళవారం సిడ్నీలో ఉన్న అర్సకాన్ ఖవాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాముదీన్ శ్రీలంకకు చెందిన వ్యక్తి. అతన్ని అరెస్ట్ చేసినందుకు తాము చింతిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోర్టు ఖర్చులు చెల్లించినా.. నిజాముదీన్ మాత్రం మరింత నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు

మరొకవైపు డిసెంబరు 6 నుంచి టీమిండియాతో ప్రారంభం కాబోయే తొలి టెస్టు కోసం సిద్ధమవుతున్న తరుణంలో సోదరుని అరెస్టు వార్త ఉస్మాన్ ఖవాజాను కలవరపరుస్తోంది. గాయం కారణంగా కొన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న ఖవాజా ఇటీవల జట్టులోకి వచ్చాడు.  భారత్‌తో సిరీస్‌లో ఖవాజా మళ్లీ గాడిలో పడాలని భావిస్తున్నాడు. ప్రస్తుత సిరీస్‌కు వార్నర్, స్మిత్‌లాంటి టాప్ ప్లేయర్స్ లేకపోవడంతో ఆస్ట్రేలియా అతనిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. కాగా, ఇప్పుడు తన సోదరుడు అరెస్టు కావడం ఉస్మాన్‌ ఖవాజా ఆటపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు