బుమ్రా లేని లోటు కనిపిస్తోంది 

12 Jul, 2018 01:20 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

భారత్, ఇంగ్లండ్‌ జట్లు టి20 సిరీస్‌ లో తమ సత్తాను ప్రదర్శించి మున్ముందు ఎలాంటి ఆటను మనకు అందించబోతున్నాయో సంకేతమిచ్చాయి. మ్యాచ్‌లో ఒకవేళ కఠినమైన పరిస్థితిలో నిలిచినా... బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లోనూ కోలుకునేందుకు ఈ అదనపు 30 ఓవర్ల ఆట ఉపయోగపడుతుంది. ఇంగ్లండ్‌ ఇటీవలే ఆస్ట్రేలియాను వైట్‌వాష్‌ చేసింది. ఆసీస్‌ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగలేదనేది వేరే విషయం. ముఖ్యంగా ఆ జట్టు బౌలింగ్‌లో లోటు కనిపించింది. అయితే చివరి వన్డేలో బట్లర్‌ మెరుపు సెంచరీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు 90కి పైగా పరుగులు చేయడం ఇంగ్లండ్‌ జట్టు సమర్థతకు నిదర్శనం. గతంలో అయితే ఏదో కొంత పోరాడటం తప్ప ఇంగ్లండ్‌ జట్టు ఆసీస్‌కు దాసోహమైపోయేది.

అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించని తత్వం మోర్గాన్‌ నేతృత్వంలోని కొత్త జట్టులో కనిపిస్తోంది. టి20ల్లో చూసినట్లు జట్టు బ్యాటింగ్‌ చాలా బలంగా ఉంది. వారి బౌలింగ్‌ ఇంకా పూర్తి స్థాయిలో కుదురుకోకపోయినా, ఈ ఫార్మాట్‌లో చాలా మంది ఇతర జట్ల కెప్టెన్లు, కోచ్‌లకు అది సాధారణ సమస్యే. భారత్‌ కూడా కుల్దీప్, చహల్‌ ఇద్దరినీ ఆడించాలా లేకా ఒకే స్పిన్నర్‌ను ఎంచుకోవాలా అని ఆలోచిస్తూ ఉండవచ్చు. బ్యాటింగ్‌ విభాగంలో శిఖర్‌ ధావన్‌ విషయంలో కొంత ఆందోళన ఉంది. చివరి టి20లో అద్భుత సెంచరీ సాధించిన రోహిత్‌ అలవోకగా ఈ ఫార్మాట్‌లోకి మారిపోగలడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో, చివరి ఓవర్లలో భువనేశ్వర్‌తో జోడీగా చెలరేగిపోయే బుమ్రా లేని లోటు కచ్చితంగా కనిపిస్తోంది. బ్రిస్టల్‌ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ జోరును అడ్డుకున్న పాండ్యాపై రెండు రకాల బాధ్యతలూ ఉన్నాయి. భారత్‌ జోరు మీద కనిపిస్తున్నా, సొంతగడ్డపై ఇంగ్లండ్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉంది కాబట్టి ఎవరు గెలుస్తారనేది అంచనా వేయడం కష్టం.  

మరిన్ని వార్తలు