అద్భుత ఫైనల్‌ పోరులో ఆండ్రిస్యూ విజయం

8 Sep, 2019 11:14 IST|Sakshi

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో సంచలనం నమోదైంది. కెనడియన్‌ బియాంక ఆండ్రిస్యూ (19) మాజీ వరల్డ్‌ నెంబర్‌ వన్‌, అమెరికన్‌ టెన్నిస్‌ స్టార్ సెరెనా విలియమ్స్‌పై విజయం సాధించింది. ఆర్థర్‌ ఆషే స్టేడియంలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌లో బియాంక ఆండ్రిస్యూ 6-3, 7-5 తేడాతో సెరెనాపై గెలిచింది. హోరాహోరి పోరులో ధీటైన ఆటతో విన్నర్‌గా నిలిచిన ఆండ్రిస్యూ ఈ విజయంతో గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ సాధించిన తొలి కెనడియన్‌గా నిలిచింది. దాంతోపాటు పిన్న వయసులో (19 ఏళ్లు) గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన మహిళగా ఆమె రికార్టు సృష్టించింది. ఇదిలాఉండగా.. గత రెండేళ్లలో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో పాల్గొంనేందుకు కూడా ఆండ్రిస్యూ అర్హత సాధించకపోవడం గమనార్హం. 

ఇక ఈ విజయంతో ఓపెన్‌ శకంలో అత్యధికంగా యూఎస్‌ గ్రాండ్‌ స్లామ్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్స్‌ను సాధించిన రికార్డును సొంతం చేసుకోవలానుకున్న సెరెనాకు నిరాశ తప్పలేదు. ఇప్పటివరకూ ఆమె ఆరు యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ గెలిచింది. ఇక 2017 ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ సాధించిన తర్వాత మహిళల సింగిల్స్‌ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ అనేది సెరెనాకు అందని ద్రాక్షగానే ఉంది. గతేడాది యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరినప్పటికీ జపాన్‌ క్రీడాకారిణి ఒసాకా చేతిలో సెరెనా పరాజయం పాలై రన్నరప్‌గా సరిపెట్టుకున్నారు. 2014లో చివరిసారి యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్‌ను గెలిచారు సెరెనా.  ఆమె ఇప్పటివరకు 23 మరో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ సొంతం చేసుకున్నారు. మరో టైటిల్‌ గెలిస్తే.. అత్యధిక సార్లు గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన మార్గరెట్‌ కోర్టు(24 గ్రాండ్‌ స్లామ్‌టైటిల్స్‌) ఆల్‌ టైమ్‌ రికార్డును సెరెనా సమం చేస్తారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

>
మరిన్ని వార్తలు