కోచ్‌తో కెప్టెన్‌ ‘వాకీటాకీ’ సంభాషణ!

17 Nov, 2018 03:19 IST|Sakshi

దక్షిణాఫ్రికా టి20 లీగ్‌లో కొత్త దృశ్యం

కేప్‌టౌన్‌: దాదాపు రెండు దశాబ్దాల క్రితం 1999 ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్‌లో జరిగిన ఒక ఆసక్తికర ఘటన ఐసీసీలో చర్చ రేపింది. సఫారీ కెప్టెన్‌ హాన్సీ క్రానే మైదానంలో ఇయర్‌ఫోన్‌ పెట్టుకొని బయట ఉన్న తన కోచ్‌ బాబ్‌ ఊమర్‌ నుంచి సూచనలు అందుకున్నాడు. అయితే గంగూలీ దీనిని గుర్తించి అంపైర్లకు ఫిర్యాదు చేయడం, వారు దీనిని తప్పుపట్టి నిబంధనలకు విరుద్ధమని ప్రకటించడం జరిగిపోయాయి. అయితే ఇప్పుడు అలాంటిదే తాజాగా టి20ల్లోకి వచ్చింది. పొట్టి ఫార్మాట్‌లో వస్తున్న నవీన మార్పుల్లో ఇది కూడా ఒకటని చెప్పవచ్చేమో.

రెండేళ్ల పాటు ఆపసోపాలు పడిన తర్వాత ఎట్టకేలకు దక్షిణాఫ్రికా తొలి టి20 లీగ్‌ ‘ఎంజాన్సీ సూపర్‌ లీగ్‌’ శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక భాషలో ‘ఎంజాన్సీ’ అనేది దక్షిణాఫ్రికాకు పర్యాయపదం. ఆటగాళ్లు, కోచ్‌తో మాట్లాడేందుకు ‘వాకీటాకీ’లను ఉపయోగించవచ్చని అధికారికంగా లీగ్‌ నిర్వాహకులు ప్రకటించారు. తొలి మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్‌ నాయకత్వంలోని టిష్వాన్‌ స్పార్టన్స్‌... కేప్‌టౌన్‌ బ్లిట్జ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌ ఆరో ఓవర్లో ‘వాకీటాకీ’ దృశ్యం కనిపించింది. మైదానం బయట ఉన్న తమ కోచ్‌ మార్క్‌ బౌచర్‌తో డివిలియర్స్‌ సంభాషించి తగిన సలహాలు తీసుకున్నాడు. ఈ కొత్త మార్పు తర్వాత మున్ముందు టి20ల్లో ఇంకా ఎలాంటి అనూహ్య, ఆసక్తికర విషయాలు చేరుతాయో చూడాలి. 

మరిన్ని వార్తలు