ఐఎస్‌ఎల్‌ చాంప్‌ చెన్నైయిన్‌

18 Mar, 2018 04:12 IST|Sakshi
ఐఎస్‌ఎల్‌ ట్రోఫీతో చెన్నైయిన్‌ ఆటగాళ్ల సంబరం

ఫైనల్లో బెంగళూరు ఎఫ్‌సీపై గెలుపు

‘హీరో ఆఫ్‌ ద లీగ్‌’ సునీల్‌ చెత్రి  

బెంగళూరు: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీలో భారత క్రికెటర్‌ ధోని, బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ టీమ్‌ చెన్నైయిన్‌ ఎఫ్‌సీ మళ్లీ మెరిసింది. ఈ లీగ్‌లో రెండోసారి టైటిల్‌ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో చెన్నయిన్‌ 3–2 గోల్స్‌ తేడాతో బెంగళూరు ఎఫ్‌సీపై విజయం సాధించింది. బ్రెజిలియన్‌ ఆటగాళ్లు మెల్సన్‌ అల్వెస్‌ రెండు గోల్స్, రాఫెల్‌ ఆగస్టో ఒక గోల్‌ చేసి చెన్నైయిన్‌ను గెలిపించారు. డిఫెండర్‌ మెల్సన్‌ అల్వెస్‌ (17వ ని., 45వ ని.) అసాధారణ ప్రదర్శనతో చెలరేగాడు.

ఆట ఆరంభంలోనే భారత స్టార్‌ సునీల్‌ చెత్రి (9వ ని.) గోల్‌ చేసి బెంగళూరును ఆధిక్యంలో నిలబెట్టగా... ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే మెల్సన్‌ గోల్‌ చేసి స్కోరు సమం చేశాడు. ద్వితీయార్ధంలో మిడ్‌ఫీల్డర్‌ రాఫెల్‌ ఆగస్టో (67వ ని.) కీలకమైన గోల్‌ చేయడంతో... ప్రత్యర్థి జట్టు బెంగళూరు తరఫున మికు (ఇంజూరి టైమ్‌ 90+2) చివరి నిమిషాల్లో గోల్‌ చేసినా లాభం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఐదు గోల్స్‌లో నాలుగు హెడర్‌ ద్వారానే వచ్చాయి.

చెన్నైయిన్‌ జట్టు 2015 సీజన్‌లోనూ టైటిల్‌ గెలిచింది. లీగ్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన అట్లెటికో డి కోల్‌కతా (2014, 2016) సరసన చేరింది. మ్యాచ్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో బెంగళూరు ఎఫ్‌సీ స్టార్‌ సునీల్‌ చెత్రి ‘హీరో ఆఫ్‌ ద లీగ్‌’, గోవా ఫార్వర్డ్‌ ఆటగాడు ఫెర్రాన్‌ కొరొమినస్‌కు ‘గోల్డెన్‌ బూట్‌’, ఉదంత (బెంగళూరు) ‘పాస్‌ ఆఫ్‌ ద సీజన్‌’, కాల్డరన్‌ (చెన్నైయిన్‌) ‘ఫిటెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద లీగ్‌’, లాల్‌రుతర (కేరళ బ్లాస్టర్స్‌) ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద లీగ్‌’ అవార్డులు అందుకున్నారు.
 

మరిన్ని వార్తలు