మళ్లీ గెలిచిన గేల్‌

17 Jul, 2019 08:04 IST|Sakshi

ఫెయిర్‌ ఫ్యాక్స్‌ మీడియాకు కోర్టులో చుక్కెదురు

సిడ్నీ:  వెస్టిండీస్‌ క్రికెట్‌ స్టార్‌ క్రిస్‌ గేల్‌ న్యాయపోరాటంలో మరోసారి గెలిచాడు. పరువు నష్టం కేసులో గేల్‌కు అనుకూలంగా వచ్చిన తీర్పును సవాల్‌ చేసిన ఫెయిర్‌ ఫ్యాక్స్‌ మీడియాకు కోర్టులో చుక్కెదురైంది. గేల్‌కు 3 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు (సుమారు రూ. కోటీ 45 లక్షలు) పరిహారంగా చెల్లించాల్సిందేనని తాజాగా న్యూసౌత్‌వేల్స్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే పరిహారాన్ని మరింత పెంచాలంటూ గేల్‌ చేసిన మరో అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. 2015 వన్డే ప్రపంచ కప్‌ సందర్భంగా ఒక మహిళతో గేల్‌ అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమె ముందు నగ్నంగా నిలబడ్డాడని గేల్‌పై 2016లో పత్రికలో వరుస కథనాలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొట్టిపారేసిన గేల్‌ కోర్టును ఆశ్రయించాడు. తనకు చెడ్డపేరు తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కథనాలు ప్రచురించారని, అలాంటి ఘటన ఏదీ జరగలేదని అతను వాదించాడు. ఫెయిర్‌ ఫ్యాక్స్‌ తన వార్తలకు సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో కోర్టు గేల్‌కు అనుకూలంగా తీర్పునిస్తూ అతనికి పరిహారం చెల్లించాలని మీడియా సంస్థను ఆదేశించింది.   

మరిన్ని వార్తలు