అవతలి పక్షంతో సంప్రదింపులా?

21 Oct, 2023 06:05 IST|Sakshi

న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా పరువు నష్టం కేసులో అవతలి పక్షంతో సంప్రదింపులకు దిగినందుకు ఆమె తరఫు సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకర నారాయణన్‌ను ఢిల్లీ హైకోర్టు మందలించింది. దాంతో ఆయన కేసు నుంచి తప్పుకున్నారు. లోక్‌సభలో పారిశ్రామికవేత్త అదానీ గ్రూపుపై ప్రశ్నలడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందాని నుంచి మహువా డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే, సుప్రీంకోర్టు లాయర్‌ జై అనంత్‌ దేహద్రాయ్‌ తదితరులు ఆరోపించడం తెలిసిందే. వారిపై ఆమె పరువు నష్టం దావా వేశారు.

లాయర్‌ నారాయణన్‌ గురువారం తనకు ఫోన్‌ చేసి, ఆమెపై దాఖలు చేసిన సీబీఐ ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని కోరినట్టు దేహద్రాయ్‌ హైకోర్టుకు తెలిపారు. దాంతో న్యాయమూర్తి జస్టిస్‌ సచిన్‌ దత్తా ఆగ్రహించారు. ‘‘ఇది విని నేను నిజంగా షాక య్యాను. ఇలా మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయ త్నిస్తే ఈ కేసులో వాదించేందుకు మీరెలా అర్హుల వుతారు?’’అని ప్రశ్నించారు. దేహద్రాయ్, మహువా కొంతకాలం పాటు సహజీవనం చేసినట్టు తృణమూల్‌ వర్గాలు చెబుతుంటాయి. ఆయన తమ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారని, అసభ్యకర మెసేజీలు పంపుతున్నారని, చోరీకి యత్నించారని గత ఆర్నెల్లలో మహువా పలు కేసులు పెట్టారు.

మరిన్ని వార్తలు