రేవంత్‌కు హైకోర్టులో ఊరట

14 Oct, 2023 01:49 IST|Sakshi

పరువు నష్టం కేసులోకింది కోర్టు ఉత్తర్వులు కొట్టివేత 

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ్‌ అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రామేశ్వర్‌రావు దాఖలు చేసిన క్రిమినల్‌ పరువు నష్టం కేసులో కింది కోర్టు ఇచ్చిన కాగ్నిజెన్స్‌ ఆర్డర్‌ను రద్దు చేశారు. 2014లో డీఎల్‌ఎఫ్‌ భూములకు సంబంధించి టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికల్లో రేవంత్‌ చేసిన కొన్ని ప్రకటనల వల్ల తన పరువుకు భంగం వాటిల్లిదంటూ మేజిస్టేట్‌ కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిని కింది కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకోవడంపై రేవంత్‌ రెడ్డి హైకోర్టులో సవాల్‌ చేశారు.

దీనిపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. హైదరాబాద్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు కాగ్నిజెన్స్‌ ఉత్తర్వులను జస్టిస్‌ లక్ష్మణ్‌ కొట్టేస్తూ తీర్పు చెప్పారు. విధానపరమైన లోపాలను గుర్తించి తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పరువు నష్టం కేసును తిరిగి విచారణ చేపట్టాలని కింది కోర్టును ఆదేశించారు. పిటిషనర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా కాగ్నిజెన్స్‌కు కింది కోర్టు అనుమతిచ్చిందని చెప్పారు.

కారణం ఏమిటో స్పష్టం చేయకుండా కాగ్నిజెన్స్‌లోకి తీసుకోవడం చెల్లదన్నారు. రేవంత్‌రెడ్డి భూముల అన్యాక్రాంతంపైన మాత్రమే మాట్లాడారని, దీనివల్ల రామేశ్వర్‌రావుకు నష్టం కలగలేదన్నారు. ఏ మాత్రం పట్టించుకోకుండా అనేక చేతులు మారిన తర్వాత రామేశ్వరరావు కంపెనీకి చేరిందని మాత్రమే ఆరోపించారని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, మేజి్రస్టేట్‌ కోర్టు జారీచేసిన కాగ్నిజెన్స్‌ ఆదేశాలను రద్దు చేసింది. తిరిగి తాజాగా విచారణ చేసేందుకు కింది కోర్టుకు అనుమతిచ్చింది.  

మరిన్ని వార్తలు