స్మిత్‌ చూసీ చూడనట్లున్నాడు

28 Dec, 2018 03:50 IST|Sakshi

బాల్‌ ట్యాంపరింగ్‌పై ఆసీస్‌ మాజీ కోచ్‌ లీమన్‌ వ్యాఖ్య 

మెల్‌బోర్న్‌: కేప్‌టౌన్‌ టెస్టులో సహచరులు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్న సంగతి తెలిసినా కెప్టెన్‌ స్మిత్‌ చూసీచూడనట్లు వ్యవహరించాడని అప్పటి కోచ్‌ లీమన్‌ వ్యాఖ్యానించారు. ఇందులో కోచ్‌ పాత్ర లేకపోయినా... నైతిక బాధ్యతగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లీమన్‌ మాట్లాడుతూ ‘నాయకుడిగా బాధ్యతతో వ్యవహరించాల్సిందిపోయి స్మిత్‌ మిన్నకుండిపోయాడు. ఆ తతంగమంతా చూసినా చూడనట్లు కళ్లు మూసుకున్నాడు. ఆ తప్పే పెను వివాదానికి దారితీసింది.

జట్టుకు, బోర్డుకు తలవంపులు తెచ్చింది’ అని లీమన్‌ తెలిపారు. కెప్టెన్‌ ఎలాంటి ఒత్తిళ్లనయినా తట్టుకోగలగాలని, ఎలాగైనా గెలవాలనే కసితో తప్పు చేయకూడదని చెప్పారు. ‘బాన్‌క్రాఫ్ట్‌కు బాల్‌ ట్యాంపరింగ్‌ చేయాలని వార్నర్‌ చెప్పినపుడు అతను నాకు లేదంటే సహాయ సిబ్బందికైనా తెలపాల్సింది. అపుడే వారించే వాళ్లం. అలా కాకుండా వాళ్లంతా (ముగ్గురు) పెద్ద తప్పే చేశారు. ఇది నిజంగా ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఇబ్బందికరమైన అంశం’ అని లీమన్‌ అన్నారు. 1998 నుంచి 2004 వరకు ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన లీమన్‌ 27 టెస్టులు ఆడాడు.   

మరిన్ని వార్తలు