ఎన్నాళ్లకెన్నాళ్లకు...

29 Aug, 2015 01:17 IST|Sakshi
ఎన్నాళ్లకెన్నాళ్లకు...

 బీజింగ్: స్ప్రింట్ రేసులు అనగానే విజేతల జాబి తాలో ముందుగా జమైకా లేదా అమెరికా అథ్లెట్స్ పేర్లు కనిపిస్తాయి. కానీ ప్రస్తుత ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జమైకా, అమెరికా అథ్లెట్స్ దూకుడుకు అడ్డుకట్ట వేసి మహిళల 200 మీటర్ల విభాగంలో నెదర్లాండ్స్ అమ్మాయి డాఫ్నె ష్కిపెర్స్ చాంపియన్‌గా నిలిచి పెను సంచలనం సృష్టించింది. శుక్రవారం జరిగిన ఈ ఈవెంట్ ఫైనల్లో ష్కిపెర్స్ 21.63 సెకన్లలో గమ్యానికి చేరుకొని స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది.
 
 ఎలానీ థాంప్సన్ (జమైకా-21.66 సెకన్లు), వెరోనికా (జమైకా-21.97 సెకన్లు) రజత, కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. ష్కిపెర్స్ ప్రదర్శనతో 12 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో యూరోప్ అథ్లెట్‌కు పసిడి పతకం లభించినట్టయింది. చివరిసారి 2003లో అనస్తాసియా కాపాచిన్స్‌కాయా (రష్యా) ఈ ఘనత సాధించింది. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో సెర్గీ షుబెన్‌కోవ్ (రష్యా-12.98 సెకన్లు) చాంపియన్‌గా అవతరించగా... పార్చ్‌మెంట్ (జమైకా-13.03 సెకన్లు) రెండో స్థానంలో, మెరిట్ (అమెరికా-13.04 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో డానియెలా (జమైకా-12.57 సెకన్లు) స్వర్ణం దక్కించుకుంది.
 
 మహిళల లాంగ్‌జంప్‌లో తియానా బార్టోలెటా (అమెరికా-7.14 మీటర్లు) స్వర్ణ పతకాన్ని సాధించగా... షారా ప్రాక్టర్ (బ్రిటన్-7.07 మీటర్లు), స్పానోవిక్ (సెర్బియా-7.01 మీటర్లు) రజత, కాంస్య పతకాలను నెగ్గారు. మహిళల 20 కిలోమీటర్ల నడకలో లియు హోంగ్ (చైనా-1గం:27ని.45 సెకన్లు) పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. భారత్‌కు చెందిన ఖుష్‌బీర్ కౌర్ 37వ స్థానంతో సరిపెట్టుకుంది.
 

మరిన్ని వార్తలు