స్టెయిన్‌ ‘టెస్టు’ ముగిసింది!

6 Aug, 2019 09:59 IST|Sakshi

టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌

అత్యధిక వికెట్ల జాబితాలో ఎనిమిదో స్థానం

వన్డేలు, టి20ల్లో కొనసాగుతానని ప్రకటన  

జొహన్నెస్‌బర్గ్‌: ఫాస్ట్‌బౌలింగ్‌కు పర్యాయపదంగా నిలిచిన ఈతరం దిగ్గజం టెస్టు క్రికెట్‌లో తన ఆటను ముగించాడు. ఎర్ర బంతితో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన సఫారీ టెర్రర్‌ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ పేసర్‌గా తనదైన ముద్ర వేసిన డేల్‌ స్టెయిన్‌ టెస్టు క్రికెట్‌నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించాడు. గత కొంతకాలంగా తరచూ గాయాలబారిన పడిన 36 ఏళ్ల స్టెయిన్‌ ఇకపై వన్డేలు, టి20లకు పరిమితం అవుతానని చెప్పాడు. ‘నేను ఎంతగానో ప్రేమించిన ఫార్మాట్‌నుంచి ఇక తప్పుకుంటున్నాను. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాలపరంగా కూడా ఆటగాడిగా ఎంతో పరీక్ష పెట్టే టెస్టు క్రికెట్టే నా దృష్టిలో అత్యుత్తమం. మళ్లీ టెస్టులు ఆడననే విషయం నన్ను నిజంగా చాలా బాధ పెడుతోంది. ఇకపై వన్డేలు, టి20లు మాత్రమే ఆడి నా కెరీర్‌ను మరికొంత కాలం పొడిగించుకోవాలని భావిస్తున్నాను’ అని స్టెయిన్‌ తన రిటైర్మెంట్‌ ప్రకటనలో పేర్కొన్నాడు. 93 టెస్టుల్లో స్టెయిన్‌ 439 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్టెయిన్‌... ఓవరాల్‌గా ఈ జాబితాలో ఎనిమిదో స్థానంతో తన కెరీర్‌ ముగించాడు.   

ఎదురులేని స్టెన్‌ గన్‌!

అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం, 2008...అత్యద్భుత పేస్‌ బౌలింగ్‌ ప్రదర్శనతో స్టెయిన్‌కు 5 వికెట్లు...భారత్‌ 76 ఆలౌట్‌! మరో రెండేళ్ల తర్వాత నాగపూర్‌ వేదిక... స్టెయిన్‌కు 7 వికెట్లు... కుప్పకూలిన టీమిండియా, దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ విజయం... భారత గడ్డపై టెస్టుల్లో ఒక విదేశీ బౌలర్‌ చెలరేగిపోవడమే అరుదు. అదీ ఒక ఫాస్ట్‌ బౌలర్‌ మన బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టడం అసాధారణం... కానీ స్టెయిన్‌కు పిచ్‌ స్వభావంతో పని లేదు. తన పదునైన బౌలింగ్‌పై నమ్మకమే తప్ప సొంత మైదానమా లేక ప్రత్యర్థి వేదికనా అనేది అనవసరం... అందుకే అతను ఈతరం ఫాస్ట్‌ బౌలర్లలో అందరికంటే అగ్రభాగాన నిలిచాడు. జొహన్నెస్‌బర్గ్‌తో మొదలు పెడితే పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్, హరారే, గాలే, కరాచీ, ఓవల్, మెల్‌బోర్న్‌... అన్ని మూలలా అతను ప్రత్యర్థి బ్యాట్‌మెన్‌ను గడగడా వణికించాడు. పచ్చిక మైదానాల నుంచి దుమ్ము రేగే పిచ్‌ల వరకు ఒకదానితో మరోదానికి పోలికే లేని వేదికలపై అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. ఉపఖండంలో ఆడిన 22 టెస్టుల్లో కేవలం 24.11 సగటుతో 92 వికెట్లు తీయడం అతడిని తన తరంలోని మెక్‌గ్రాత్, అండర్సన్‌లకంటే పైన నిలబెడుతుంది.


‘నేను అమిత వేగంతో బౌలింగ్‌ చేసినప్పుడు బ్యాట్స్‌మెన్‌ చెవి పక్కనుంచి జూమ్మంటూ బంతి దూసుకుపోతుంటే ఆ శబ్దం చాలా వినపొంపుగా అనిపిస్తుంది’... ఇలా తన పేస్‌ గురించి స్వయంగా ఎన్నో సార్లు గొప్పగా చెప్పుకున్న స్టెయిన్‌ స్పీడ్‌నే శ్వాసించాడు.

ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే కాకుండా చివరి వరకు కూడా కనీసం 140 కిలోమీటర్లకు తగ్గని ఒకే తరహా వేగాన్ని కొనసాగించగలగడం అతనికే సాధ్యమైంది. ఆకట్టుకునే యాక్షన్, 19 మీటర్ల రనప్, అదరగొట్టే అవుట్‌ స్వింగర్లు స్టెయిన్‌ చిరునామాగా మారాయి. ఒకటా, రెండా స్టెయిన్‌ బౌలింగ్‌ దక్షిణాఫ్రికాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్‌లలో టెస్టు సిరీస్‌ విజయాలు, భారత గడ్డపై రెండు సిరీస్‌లు ‘డ్రా’ కావడంలో స్టెయిన్‌ కీలక పాత్ర పోషించాడు. ప్రతీ దేశంలో అతను ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవడం విశేషం. స్టెయిన్‌ తమతో ఉన్న సమయంలో దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్‌లలో ఒక్క సిరీస్‌ కూడా ఓడిపోకపోవడం అతని విలువను చూపిస్తోంది. సొంతగడ్డపై గొప్పగా రాణించిన బౌలర్లు కూడా విదేశాల్లో పేలవ ప్రదర్శన కనబర్చారు. కానీ స్టెయిన్‌కు మాత్రమే ప్రతీ చోటా ఘనమైన రికార్డు ఉంది. దక్షిణాఫ్రికాలో 21.62 సగటుతో 261 వికెట్లు తీస్తే, విదేశాల్లో 24.23 సగటుతో 164 వికెట్లు తీయడం అతని ఘనతకు నిదర్శనం. 2010 నుంచి 2015 వరకు నిర్విరామంగా స్టెయిన్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగాడు. కనీసం 300 వికెట్లు పడగొట్టిన బౌలర్లలో అందరికంటే అత్యుత్తమ స్ట్రయిక్‌ రేట్‌ (42.30) స్టెయిన్‌దే. ఇటీవల తిరగబెట్టిన భుజం గాయం స్టెయిన్‌ టెస్టు కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించిందని చెప్పవచ్చు. మేలిరకం అసలు సిసలు ఫాస్ట్‌ బౌలర్‌గా అతను టెస్టు క్రికెట్‌పై వేసిన ముద్ర మాత్రం ఎప్పటికీ ఎవరూ మరచిపోలేనిది.  

టెస్టు కెరీర్‌ ఆడిన మ్యాచ్‌లు-93
తీసిన వికెట్లు- 439
సగటు-22.95
అత్యుత్తమ బౌలింగ్‌:7/51 (ఇన్నింగ్స్‌) 11/60 (మ్యాచ్‌)
ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు:26 సార్లు 
మ్యాచ్‌లో 10 వికెట్లు:5 సార్లు 
–సాక్షి క్రీడావిభాగం  

మరిన్ని వార్తలు