ఇడియట్‌.. దేవుడికి సంబంధమేంటి?

31 Dec, 2019 17:30 IST|Sakshi

దక్షిణాఫ్రికా స్పీడ్‌ గన్‌ డేల్‌ స్టెయిన్‌కు ఓ నెటిజన్‌ కోపం తెప్పించాడు. దీంతో ఆ నెటిజన్‌ను స్టెయిన్‌ కడిగిపారేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరుస ఓటములు, వివాదాలతో సతమవుతున్న ప్రొటీస్‌ జట్టుకు ఈ విజయం ఎంతో ఊరట కలిగించింది. దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డులో, జట్టులో కొన్ని సంస్కరణల అనంతరం స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్టులో విజయం సాధించడం పట్ల ఆదేశ తాజా, మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డుప్లెసిస్‌ సేనపై ప్రశంసల జల్లులు కురిపిస్తూ స్టెయిన్‌ ట్వీట్‌ చేశాడు. 

అయితే ఈ ట్వీట్‌పై ఓ నెటిజన్‌ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి స్టెయిన్‌ ఆగ్రహానికి గురయ్యాడు. గెలిచింది స్వదేశంలో కదా లెక్కలోకి రాదు అంటూనే దేవుడి దయతో మ్యాచ్‌ గెలిచారనే అనే అర్థంలో రీట్వీట్‌ చేశాడు. దీంతో స్టెయిన్‌కు చిర్కెత్తుకొచ్చింది. ఆ నెటిజన్‌ భారత్‌కు చెందిన వాడని గుర్తించిన ఈ ప్రొటీస్‌ బౌలర్‌ అతడికి గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ‘అయితే టీమిండియా కూడా భారత్‌లో గెలిచినవి లెక్కలోకి రావా? అయినా మా గెలుపుకు దేవుడితో సంబంధం ఏంటి? ఇడియట్‌’అంటూ స్టెయిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు స్టెయిన్‌కు అండగా నిలుస్తుండగా.. మరికొందరు ఇడియట్‌ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాకు ఇదే తొలి విజయం కావడం విశేషం. 
 

మరిన్ని వార్తలు