పూర్తిగా గాల్లోకి ఎగిరి స్టన్నింగ్‌ క్యాచ్‌..!

2 Apr, 2018 09:03 IST|Sakshi

జోహెన్నెస్‌బర్గ్‌: ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన నాలుగో టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్‌ ఎల్గర్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో అదరగొట్టాడు. దాదాపు పది అడుగుల దూరం పరిగెత్తుకుంటూ వచ్చి.. పూర్తిగా గాల్లోకి ఎగిరి అతను క్యాచ్‌ క్రికెట్‌ అభిమానుల్ని సంభ్రమంలో ముంచెత్తింది.

నాలుగో టెస్టులో మొదట బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు 488 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌ జట్టు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. 207 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా తాత్కాలిక కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ మొండిపట్టుదలతో క్రీజ్‌ అంటిపెట్టుకొని ఉండి ప్రతిఘటించాడు. బొటనవేలికి అయిన గాయం సలుపుతున్నా.. పైన్‌ చెలరేగి ఆడాడు. స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన పైన్‌.. అనంతరం కగిసో రబడా బౌలింగ్‌లోనూ ఒక ఫోర్‌ మీద దూకుడు మీద కనిపించాడు. కానీ, రబడా ఓవర్ చివరి బంతిని పైన్‌ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు.

ఈ బంతిని మిడ్‌వికెట్‌ దిశగా తరలించేందుకు పైన్‌ ప్రయత్నించగా.. అది అమాంతం గాల్లోకి ఎగిరింది. మిడాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఎల్గర్‌ ఈ బంతిని క్యాచ్‌ అందుకోవడం మొదట్లో అసాధ్యమనిపించింది. కానీ, దృష్టినంతా గాలిలోని బంతిపైనే నిలిపిన ఎల్గర్‌.. దాదాపు పది అడుగుల దూరం పరిగెత్తుతూ.. ఒక్కసారి గాల్లోకి ఎగిరి.. కుడివైపు డ్రైవ్‌ చేస్తూ.. గాల్లోనే బంతిని ఒడిసిపట్టాడు. దీంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌కు 221 పరుగుల వద్ద తెరపడింది. గాల్లో సూపర్‌మ్యాన్‌లా డ్రైవ్‌ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ పట్టిన డీన్‌ ఎల్గర్‌ పట్టిన క్యాచ్‌ నెటిజన్లను విస్మయపరిచింది. దీంతో అతని క్యాచ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ సోషల్‌ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు