అగ్రస్థానంలో ధర్మ

9 Feb, 2019 10:27 IST|Sakshi

 అద్భుత ప్రదర్శన కనబరిచిన దిగ్విజయ్‌ సింగ్‌

 గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా (పీజీటీఐ) సీజన్‌ ఆరంభ టోర్నీ గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో బెంగళూరు ప్లేయర్‌ ఎం. ధర్మ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌ (హెచ్‌జీసీ) వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో ధర్మ అగ్రస్థానంలో నిలిచాడు. శుక్రవారం మూడో రౌండ్‌ పోటీల్లో ధర్మ 2 అండర్‌ 69 పాయింట్లు స్కోర్‌ సాధించి ఓవరాల్‌ పాయింట్లలో 16 అండర్‌ 197తో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గతేడాది ఈ టోర్నీలో ఐదో స్థానంలో నిలిచిన ధర్మ... మూడో రౌండ్‌ ఆరంభంలో తడబడ్డాడు. ఐదో హోల్‌ను నిర్ణీత షాట్లకు మించి అదనంగా మరో షాట్‌ (బోగే)ను ఉపయోగించి పూర్తి చేశాడు. దీన్నుంచి వెంటనే తేరుకున్న 32 ఏళ్ల బెంగళూరు ప్లేయర్‌ వెంటవెంటనే 3 బిర్డీస్‌ నమోదు చేసి గాడిలో పడ్డాడు. తర్వాత 15వ హోల్‌ వద్ద తృటిలో ఈగల్‌ను చేజార్చుకుని బిర్డీతో సరిపెట్టుకున్నాడు.

చివర్లోనూ మరో బోగే సహాయంతో 69 షాట్లలో రౌండ్‌ను పూర్తిచేశాడు. మూడోరౌండ్‌ ముగిసేసరికి ఓవరాల్‌గా 14 అండర్‌ 199 పాయింట్లతో చిక్కరంగప్ప (బెంగళూరు), రషీద్‌ ఖాన్‌ (ఢిల్లీ), కరణ్‌దీప్‌ కొచ్చర్‌ (చండీగఢ్‌), ప్రియాన్షు సింగ్‌ (గురుగ్రామ్‌) సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. కెరీర్‌లో రెండో ప్రొఫెషనల్‌ ఈవెంట్‌లో పాల్గొంటున్న 22 ఏళ్ల ప్రియాన్షు అద్భుత పోరాటపటిమ కనబరిచాడు. ఈ ఏడాది పీజీటీఐ క్వాలిఫయింగ్‌ స్కూల్‌ చాంపియన్‌ అయిన ప్రియాన్షు...  తొలి ఏడు హోల్స్‌లో 3 బోగేలతో వెనుకబడినప్పటికీ... తర్వాత 6 బిర్డీస్‌తో అదరగొట్టాడు. ఫలితంగా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఓవరాల్‌గా రెండోస్థానంలో నిలిచాడు. మూడోరోజు పోటీల్లో ప్రియాన్షుతో పాటు చిక్కరంగప్ప 70 పాయింట్లు, రషీద్‌ ఖాన్‌ 68 పాయింట్లు, కరణ్‌దీప్‌ కొచ్చర్‌ 66 పాయింట్లు సాధించి ఓవరాల్‌ స్కోరులో సంయుక్తంగా రెండోస్థానంలో ఉన్నారు.

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఉదయన్‌ మానె (67, అహ్మదాబాద్‌) ఏడో స్థానంలో, ఖాలిన్‌ జోషి (68, బెంగళూరు) ఆరో స్థానంలో నిలిచారు. గురువారం ఆధిపత్యం ప్రదర్శించిన అమన్‌రాజ్‌ పేలవ ప్రదర్శనతో ఎనిమిదోస్థానానికి పడిపోయాడు. అతను నిర్దేశించిన 71 షాట్లకు బదులుగా 74 షాట్లలో రౌండ్‌ను పూర్తిచేశాడు. కొత్త కోర్స్‌ రికార్డుతో అందరి దృష్టిని ఆకర్షించిన గౌరవ్‌ ప్రతాప్‌ సింగ్‌ (71 పాయింట్లు) నాలుగు స్థానాలు కోల్పోయి అమన్‌ రాజ్, హనీ బైసోయాతో కలిసి సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఓవరాల్‌ ప్రదర్శనలో వెనుకబడినప్పటికీ మూడోరోజు పోటీల్లో గురుగ్రామ్‌కు చెందిన దిగ్విజయ్‌ సింగ్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పోటీల్లో భాగంగా అతను 11వ హోల్‌ను కేవలం ఒక షాట్‌లోనే పూర్తిచేసి ఔరా అనిపించాడు. దీంతో అతను ఓవరాల్‌ ర్యాంకింగ్‌లో 4 అండర్‌ 209 పాయింట్లతో 26వ స్థానంలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు