అయ్యో... సింధు!

7 Mar, 2019 00:00 IST|Sakshi

తొలి రౌండ్‌లోనే  ఓడిపోయిన భారత స్టార్‌

సాయిప్రణీత్‌ శుభారంభం

ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌

 భారీ అంచనాల మధ్య టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకరిగా బరిలోకి దిగిన భారత స్టార్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు మరోసారి ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ కలిసి రాలేదు. సన్నద్ధత బాగున్నా... తొలిరౌండ్‌లోనే చిరకాల ప్రత్యర్థి ఎదురుకావడం... కీలక సమయంలో అనవసర తప్పిదాలు చేయడం... వెరసి ఈ తెలుగు తేజం పోరాటం మొదటి రౌండ్‌లోనే ముగిసింది. వందేళ్లకు పైబడిన చరిత్ర ఉన్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఏడోసారి పాల్గొన్న సింధు తొలి రౌండ్‌లో ఓడిపోవడం ఇది నాలుగోసారి. 2012, 2014, 2016లలో కూడా సింధు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.   

బర్మింగ్‌హమ్‌: ఈ సీజన్‌లో తాను బరిలోకి దిగిన రెండో టోర్నమెంట్‌లోనూ భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. బుధవారం మొదలైన ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో సింధు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ప్రపంచ పదో ర్యాంకర్‌ సుంగ్‌ జీ హున్‌ (దక్షిణ కొరియా)తో జరిగిన మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ సింధు 16–21, 22–20, 18–21తో ఓడిపోయింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు రెండో గేమ్‌లో మూడు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌కు ముందు సుంగ్‌ జీ హున్, సింధు 14 సార్లు తలపడగా... సింధు ఎనిమిదిసార్లు, సుంగ్‌ జీ హున్‌ ఆరుసార్లు గెలిచారు. ముఖాముఖి రికార్డు ప్రకారం వీరిద్దరికి ఒకరి ఆటతీరుపై మరొకరికి మంచి అవగాహన ఉంది. దాంతో మ్యాచ్‌ ఆరంభం నుంచే ఇద్దరూ ప్రతి పాయింట్‌ కోసం పోరాడారు. ఫలితంగా ఇద్దరి మధ్య పాయింట్ల వ్యత్యాసం రెండు, మూడు కంటే ఎక్కువ దాటలేదు. అయితే స్కోరు 17–16 వద్ద సుంగ్‌ జీ హున్‌ ఒక్కసారిగా చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు గెల్చుకొని తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సుంగ్‌ జీ హున్‌ నిలకడగా ఆడగా... సింధు కూడా తనవంతుగా పోరాడింది. అయినప్పటికీ పలుమార్లు సుంగ్‌ జీ హున్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. ఒకదశలో 20–17తో విజయం అంచులకు చేరింది. అయితే సింధు పట్టుదలతో పోరాడి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 22–20తో రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌ కూడా హోరాహోరీగా సాగింది. విరామానికి సింధు 9–11తో రెండు పాయింట్లు వెనుక బడింది. ఆ తర్వాత సుంగ్‌ జీ హున్‌ విజృంభించగా... సింధు అనవసర తప్పిదాలు చేసి వరుస పాయింట్లు కోల్పోయి 13–20తో ఓటమిని ఆహ్వానించింది. ఈ దశలో సింధు వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి తేరుకునే ప్రయత్నం చేసింది. అయితే సుంగ్‌ జీ హున్‌ సంయమనం కోల్పోకుండా ఆడి ఆరో ప్రయత్నంలో మ్యాచ్‌ పాయింట్‌ సాధించి విజయాన్ని దక్కించుకుంది.
 
ప్రణయ్‌ పరాజయం 

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో హైదరాబాద్‌ ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్‌ 21–19, 21–19తో భారత్‌కే చెందిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌పై గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడినా కీలకదశలో సాయిప్రణీత్‌ పాయింట్లు సాధించి విజయం రుచి చూశాడు.   పోరాడి ఓడిన సిక్కి రెడ్డి జంట మహిళల డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్‌ ద్వయం 21–18, 12–21, 12–21తో ఎకతెరీనా బొలోటోవా–అలీనా దెవ్లతోవా (రష్యా) జంట చేతిలో... సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 21–16, 26–28, 16–21తో ప్రపంచ ఏడో ర్యాంక్‌ జోడీ షిహో తనాకా–కొహారు యోనెమోటా (జపాన్‌) చేతిలో ఓడిపోయాయి. రెండో గేమ్‌లో సిక్కి రెడ్డి జంట మ్యాచ్‌ పాయింట్‌ వదులుకోవడం గమనార్హం.

లిన్‌ డాన్‌కు చుక్కెదురు
పురుషుల సింగిల్స్‌లో తొలి రోజే సంచలన ఫలితం నమోదైంది. చైనా దిగ్గజ క్రీడాకారుడు లిన్‌ డాన్‌ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా, రెండుసార్లు ఒలింపిక్స్‌ విజేతగా, ఆరుసార్లు ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌గా నిలిచిన ఈ సూపర్‌ స్టార్‌ 21–19, 14–21, 7–21తో ప్రపంచ 17వ ర్యాంకర్‌ కాంటా సునెయామ (జపాన్‌) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌ను అతికష్టమ్మీద నెగ్గిన ఈ ఆసియా మాజీ చాంపియన్‌ రెండో గేమ్‌ నుంచి తడబడ్డాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. ఇప్పటివరకు 15 సార్లు ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో పాల్గొన్న లిన్‌ డాన్‌ తొలి రౌండ్‌లో ఓడిపోవడం ఇదే ప్రథమం. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ షి యుకి (చైనా) 21–17, 21–16తో ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)పై గెలిచాడు.  

తై జు యింగ్‌ ముందంజ... 
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ తై జు యింగ్‌ కేవలం 29 నిమిషాల్లో 21–12, 21–5తో మిచెల్లి లీ (కెనడా)ను చిత్తుగా ఓడించింది. రెండో సీడ్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌), మూడో సీడ్‌ చెన్‌ యుఫె (చైనా), నాలుగో సీడ్‌ అకానె యామగుచి (జపాన్‌) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఒకుహారా 21–17, 21–16తో గ్రెగోరియా (ఇండోనేసియా)పై, చెన్‌ యుఫె 21–10, 21–14తో హాన్‌ యు (చైనా)పై, యామగుచి 21–15, 21–18తో బీట్‌రెజ్‌ కొరాలెస్‌ (స్పెయిన్‌)పై నెగ్గారు.

ఆరంభంలోనే సుంగ్‌ జీ హున్‌కు ఆధిక్యం ఇచ్చేశాను. ఆధిక్యం ఎక్కువగా ఉండటంతో తేరుకోలేకపోయాను. దురదృష్టంకొద్దీ నేను కొట్టిన ఎక్కువ స్మాష్‌లు నెట్‌కు తగిలాయి. ఓవరాల్‌గా నా ఆటతీరుపట్ల సంతృప్తిగా ఉన్నాను. ఈ టోర్నీ కోసం బాగానే సాధన చేశాను. ఈరోజు నాకు కలిసి రాలేదు. ఒక్కోసారి ఇలాంటి పరాజయాలు ఎదురవుతాయి. వీటిని సవాలుగా స్వీకరించి తదుపరి టోర్నమెంట్‌లకు మరింత మెరుగ్గా సన్నద్ధమవుతాను.   
  – పీవీ సింధు 

మరిన్ని వార్తలు