నిదాహస్‌ పాఠాలు నేర్పింది! 

7 Mar, 2019 00:00 IST|Sakshi

వరల్డ్‌ కప్‌ గురించి ఆలోచించడం లేదు 

విజయ్‌ శంకర్‌ వ్యాఖ్య

నాగపూర్‌: గత ఏడాది మార్చి 18న నిదాహస్‌ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత విజయ్‌ శంకర్‌ తీవ్ర విమర్శల పాలయ్యాడు. కెరీర్‌లో తొలి టోర్నీ ఆడుతున్న అతను ఒత్తిడిలో సరైన విధంగా స్పందించలేకపోయాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తుది పోరులో వరుసగా డాట్‌ బంతులు ఆడటం, కనీసం స్ట్రయిక్‌ రొటేట్‌ చేయలేకపోవడంతో ఒక దశలో భారత్‌కు ఓటమి తప్పదనిపించింది. చివరకు దినేశ్‌ కార్తీక్‌ చలవతో మ్యాచ్‌ గెలిచినా... అభిమానులు విజయ్‌పై మాత్రం విరుచుకుపడ్డారు. ఇప్పుడు సరిగ్గా సంవత్సరం తర్వాత అతను బౌలింగ్‌లో ఒక చక్కటి ఓవర్‌తో భారత్‌ను గెలిపించాడు. అయితే నాటి మ్యాచ్‌ను తాను మర్చిపోలేదని, దాని నుంచి ఎంతో నేర్చుకున్నానని శంకర్‌ అన్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే నిదాహస్‌ ట్రోఫీ నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. స్థితప్రజ్ఞతతో ఉండటం ఎలాగో తెలిసింది. పరిస్థితులు చాలా బాగా ఉన్నా, ప్రతికూలంగా కనిపిస్తున్నా అన్ని సమయాల్లో ప్రశాంతంగా, తటస్థంగా ఉండాలని అర్థమైంది’ అతని అతను చెప్పుకొచ్చాడు.

రెండో వన్డే చివరి ఓవర్లలో ఏదో ఒకటి తాను వేయాల్సి వస్తుందని ముందే ఊహించానని, 10–15 పరుగులను కాపాడుకోవాల్సి వస్తుంది కాబట్టి మానసికంగా సిద్ధంగానే ఉన్నానని అతను వెల్లడించాడు. బంతి కొంత రివర్స్‌ స్వింగ్‌ అవుతోందని, సరైన లెంగ్త్‌లో నేరుగా వికెట్లపైకి వేస్తేనే ఫలితం దక్కుతుందని బుమ్రా చెప్పిన సూచనను తాను పాటించానన్నాడు. తాజా ప్రదర్శనతో వరల్డ్‌ కప్‌ జట్టులో చోటు ఖాయమైందా అనే ప్రశ్నకు స్పందిస్తూ విజయ్‌... దాని గురించి ఇంకా ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. ‘జట్టులో చోటు, వరల్డ్‌ కప్‌ టీమ్‌కు ఎంపికవంటి వాటి గురించి నేను అతిగా ఆలోచించను. ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. ఇందులో ప్రతీ మ్యాచ్‌ కీలకమే. నేను బాగా ఆడి జట్టును గెలిపించడమే ముఖ్యం’ అని ఈ తమిళనాడు ఆల్‌రౌండర్‌ పునరుద్ఘాటించాడు.    

మరిన్ని వార్తలు