హమ్మయ్య.. గెలిచాం

9 Nov, 2018 17:37 IST|Sakshi

అడిలైడ్‌: వరుస ఓటములతో సతమవుతున్న ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఆసీస్‌ కడవరకూ పోరాడి గెలిచింది. సాధారణ లక్ష్యాన్ని కాపాడుకున్న ఆసీస్‌ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.  ఫలితంగా ఏడు వరుస వన్డే పరాజయాల తర్వాత గెలుపు రుచి చూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 231 పరుగులు చేసింది. అరోన్‌ ఫించ్‌(41), క్రిస్‌ లిన్‌(44), అలెక్స్‌ కారే(47)లు రాణించడంతో ఆసీస్‌ గౌరవప్రదమైన స్కోరును సఫారీల ముందుంచింది. 

అయితే లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసి పరాజయం చెందింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డుప్లెసిస్‌(47), డేవిడ్‌ మిల్లర్‌(51)లు ఆకట్టుకున్నప్పటికీ గెలుపును అందించలేకపోయారు. ఆసీస్‌ బౌలర్లలో మార్కస్‌ స్టోనిస్‌ మూడు వికెట్లు సాధించగా, మిచెల్‌ స్టార్క్‌, హజల్‌వుడ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. కమిన్స్‌కు వికెట్‌ లభించింది. దక్షిణాఫ్రికా-ఆసీస్‌ జట్ల మధ్య సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే మూడో వన్డే ఆదివారం జరుగనుంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే.

2017 జనవరి నుంచి చూస్తే ఇప్పటివరకూ 20 వన్డేల ఆడిన ఆసీస్‌ 17 మ్యాచ్‌ల్లో పరాజయం చూడగా మూడు విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఈ క్రమంలోనే వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఆసీస్‌ను వెక్కిరించాయి. దాంతో తమ క్రికెట్‌ చరిత్రలో వరుస పరాజయాల రికార్డును మూటగట్టుకుంది.

మరిన్ని వార్తలు