ఎఫ్‌ఐహెచ్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీ: భారత్‌కు సులువైన ‘డ్రా’

22 Jan, 2019 00:13 IST|Sakshi

లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీలో భారత్‌కు సులువైన ‘డ్రా’ ఎదురైంది. 2020 ఒలింపిక్స్‌కు తొలి క్వాలిఫయింగ్‌ టోర్నీ అయిన ఈ ‘ఎఫ్‌ఐహెచ్‌ ఫైనల్స్‌’ టోర్నీలో భారత్‌ తమ సొంతగడ్డపైనే గ్రూప్‌ మ్యాచ్‌లు ఆడనుండటం మరో సానుకూలాంశం. భువనేశ్వర్‌లో జూన్‌ 6 నుంచి 16 వరకు రెండో పూల్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇందులో భారత్, జపాన్, మెక్సికో, పోలాండ్, రష్యా, దక్షిణాఫ్రికా, అమెరికా, ఉజ్బెకిస్తాన్‌ పోటీపడతాయి.

సోమవారం ఎఫ్‌ఐహెచ్‌ షెడ్యూల్, వేదికల్ని ఖరారు చేసింది.  పురుషుల, మహిళల జట్లను ఎనిమిది జట్ల చొప్పున మూడు పూల్స్‌గా విభజించింది. ముందుగా మలేసియాలోని కౌలాలంపూర్‌లో పురుషుల తొలి పూల్‌ మ్యాచ్‌లు ఏప్రిల్‌ 26 నుంచి మే 4 వరకు జరుగుతాయి. ఏప్రిల్‌ 15 నుంచి 23 వరకు జపాన్‌లోని హిరోషిమాలో జరిగే మహిళల పూల్‌లో భారత్, చిలీ, ఫిజీ, జపాన్, మెక్సికో, పోలాండ్, రష్యా, ఉరుగ్వే జట్లు తలపడతాయి. ఒక్కో పూల్‌ నుంచి రెండు జట్లు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందుతాయి.   

మరిన్ని వార్తలు