ఫ్రాన్స్‌ బోణీ చేసింది

17 Jun, 2018 01:21 IST|Sakshi

ఆసీస్‌పై 2–1తో విజయం

వీఏఆర్‌ పెనాల్టీతో గ్రీజ్‌మన్‌ గోల్‌

గోల్‌ లైన్‌ టెక్నాలజీతో  పోగ్బా గోల్‌ ఖరారు

కజన్‌: ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌లో వీడియో అసిస్టెంట్‌ రిఫరీ (వీఏఆర్‌), ఫ్రాన్స్‌ ఖాతా తెరిచాయి. గ్రూప్‌ ‘సి’లో శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు టెక్నాలజీ బాగా సాయం చేసింది. గోల్‌ అయిన రెండుసార్లూ టెక్నాలజీదే పాత్ర. దీంతో ‘యూరో’ రన్నరప్‌ 2–1తో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. యువ సైన్యంతో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఫ్రాన్స్‌ స్థాయికి తగిన ఆటతీరుతో బోణీ కొట్టింది. తొలిసారిగా ఈ ప్రపంచకప్‌లో ప్రవేశపెట్టిన వీఏఆర్‌ పద్ధతిలో గోల్‌ కొట్టిన ఆటగాడిగా ఆంటోనీ గ్రీజ్‌మన్‌ రికార్డులకెక్కాడు. 2016 యూరో కప్‌లో అదరగొట్టిన ఈ అట్లెటికో మాడ్రిడ్‌ స్టార్‌ను ద్వితీయార్థంలో పెనాల్టీ బాక్స్‌ వద్ద ఆస్ట్రేలియా ఆటగాడు జోష్‌ రిష్డన్‌ తప్పుగా అడ్డుకున్నాడు. మొదట రిఫరీ అండ్రెస్‌ కున్హా పెనాల్టీ కిక్‌ ఇచ్చేందుకు తిరస్కరించాడు.

దీంతో ఫ్రాన్స్‌ అప్పీల్‌కు వెళ్లడంతో వీఏఆర్‌ ఫుటేజ్‌ను పరిశీలించి పెనాల్టీ కిక్‌ ఇచ్చాడు. ఆట 58వ నిమిషంలో ఎలాంటి పొరపాటు చేయకుండా గ్రీజ్‌మన్‌ గోల్‌ చేయడంతో తొలి వీఏఆర్‌ గోల్‌ నమోదైంది. 1–0తో ఫ్రాన్స్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ఆనందం కాసేపటికే ఆవిరైంది. నాలుగు నిమిషాలకే ఆస్ట్రేలియాకు లభించిన పెనాల్టీని జెడినాక్‌ గోల్‌గా మలచడంతో స్కోరు 1–1తో సమమైంది. ఈ దశలో ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డాయి. గోల్‌పోస్ట్‌పై దాడులకు పదునుపెట్టాయి. ఈ క్రమంలో ఆట 81వ నిమిషంలో ఫ్రాన్స్‌ ఆటగాడు పోగ్బా ఫీల్డ్‌ గోల్‌ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈసారి ‘గోల్‌ లైన్‌ టెక్నాలజీ’ని పరిశీలించారు. క్రాస్‌బార్‌ను దాటిన బంతి బౌన్స్‌ అయ్యాక గోల్‌ లైన్‌ను తగిలిందా లేదా అని నిర్దారించేందుకు టెక్నాలజీని వాడారు.   

వీఏఆర్‌ కథేంటి... 
సాకర్‌ ప్రపంచకప్‌ది సుదీర్ఘ చరిత్రే. అయితే టెక్నాలజీని మాత్రం మితిమీరి వినియోగించదు ఫిఫా. మైదానంలో రిఫరీ చెప్పిందే వేదం. ఫీల్డ్‌లో ఆటగాళ్లు పెనాల్టీ బాక్స్‌లకు చేరగానే ప్రత్యర్థి ఆటగాళ్లలో కొందరు సందేహాస్పదంగా అడ్డుకోవడం పరిపాటి. ఇది మైదానంలో ఉన్న రిఫరీ కంటబడితేనే పెనాల్టీ కిక్‌ ఇస్తాడు. లేదంటే లేదు. దీంతో  ఇది చూసిచూడని వ్యవహారం కావడంతో కొందరు అదేపనిగా అనుమానాస్పద టాకిల్స్‌ (అడ్డుకోవడం) చేస్తుంటారు. ఈ సారి కొత్తగా వీడియో అసిస్టెంట్‌ రిఫరీ (వీఏఆర్‌)ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా కీలక తరుణంలో ఫౌల్‌ టాకిల్స్‌ (తప్పుగా అడ్డుకోవడం) అని తేలితే ఫీల్డ్‌ అంపైర్‌ వీఏఆర్‌ను పరిశీలించిన తర్వాత పెనాల్టీ కిక్‌ అవకాశం కల్పిస్తాడు.   

మరిన్ని వార్తలు