పంత్‌కు గంభీర్‌ ‘సీరియస్‌’ వార్నింగ్‌!

15 Sep, 2019 15:54 IST|Sakshi

న్యూఢిల్లీ:  భారత క్రికెట్‌ జట్టులో రెగ్యులర్‌గా ఆటగాడిగా మారడానికి యత్నిస్తున్న ఢిల్లీ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌కు మాజీ ఆటగాడు గౌతం గంభీర్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఇటీవల కాలంలో తరుచు అవకాశాలు దక్కించుకుంటున్న పంత్‌ ఒక్కసారి వెనక్కి చూసుకుని తన ప‍్రదర్శనపై పరిశీలన చేసుకుంటే మంచిదని క్లాస్‌ పీకాడు. ఎప్పుడూ ఉత్తేజభరితంగా మ్యాచ్‌లకు సిద్ధమవుతున్న పంత్‌ ఒక్కసారి తన ఆట తీరును సమీక్షించుకుంటే బాగుంటుందని హెచ్చరికతో కూడిన సూచన చేశాడు.

‘పంత్‌లో టాలెంట్‌ ఉంది. అందులో సందేహం లేదు. కాకపోతే ఇటీవల కాలంలో పంత్‌ ఆట ఆశాజనకంగా లేదు. అతని స్థానానికి ప్రమాదం పొంచి వుంది. మరొక నాణ్యమైన వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌తో నీకు సవాల్‌ ఎదురుకానుంది. నా ఫేవరెట్‌ ఆటగాడు సంజూ శాంసన్‌ నీకు సీరియస్‌ చాలెంజ్‌లు విసురుతున్నాడు’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.  ఇక కేఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌లపై గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు.

ప్రధానంగా మనీష్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌లు తమ స్థానాలను నిలబెట్టుకోవడానికి మరొక అవకాశం దొరికిందన్నాడు. దక్షిణాఫ్రికాతో  జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో టీమిండియానే ఫేవరెట్‌ అని గంభీర్‌ పేర్కొన్నాడు. ప్రస్తుత సఫారీ జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్ల లోటు కొట్టొచ్చినట్లు కనబడుతుందనే విషయాన్ని ప్రస్తావించాడు. ప్రధానంగా డుప్లెసిస్‌, ఆమ్లా, డేల్‌ స్టెయిన్‌లు సఫారీ జట్టుకు అందుబాటు లేకపోవడంతో అది ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమన్నాడు.

మరిన్ని వార్తలు