కోహ్లిని తలపించే మొనగాడు వచ్చాడు..!

20 Mar, 2020 15:17 IST|Sakshi

కరాచీ: టీమిండియా కెప్టెన్‌, పరుగుల మెషీన్‌ విరాట్‌ కోహ్లితో ఎక్కువగా పోల్చిన క్రికెటర్‌ ఎవరైనా ఉన్నారంటే అది పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌. తమకు కోహ్లి లాంటి ఆటగాడు ఉన్నాడంటూ పాకిస్తాన్‌ క్రికెట్‌ పెద్దలు, మాజీలు పదే పదే అజామ్‌ను చూసుకుని మురిసిపోవడం మనకు అలవాటే. కానీ ఈ విషయంలో అజామ్‌ మాత్రం తాను ఎప్పుడూ కోహ్లితో పోల్చుకోలేదు సరికదా.. ఆ పోలిక తేవద్దని చాలాసార్లు విన్నవించాడు. కాకపోతే తాను ఎక్కువగా బ్యాటింగ్‌ను ఆస్వాదించే క్రికెటర్లలో కోహ్లి కూడా ఒకడని అజామ్‌ ఇప్పటికే స్పష్టం చేశాడు. కాగా, ఇప్పుడు కోహ్లి, అజామ్‌లను తలపించే మొనగాడు వచ్చాడని అంటున్నాడు పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత రమీజ్‌ రాజా.  ఇప్పటివరకూ అంతర్జాతీయ అరంగేట్రం చేయని 19 ఏళ్ల హైదర్‌ అలీలో కోహ్లి, అజామ్‌లకు ఏమాత్రం తీసిపోని బ్యాటింగ్‌ నైపుణ్యం ఉందని అభిప్రాయపడ్డాడు. (ధోని భవితవ్యంపై గావస్కర్‌ స్పందన..)

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) తాజా సీజన్‌లో అండర్‌-19 జట్టు ఓపెనర్‌ అయిన హైదర్‌ అలీ రాణించడంతో అతన్ని ఆకాశానికెత్తేశాడు రమీజ్‌ రాజా. కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా వాయిదా పడ్డ ఈ లీగ్‌లో ఇప్పటివరకూ హైదర్‌ అలీ 9 మ్యాచ్‌లు ఆడి 239 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే రమీజ్‌ రాజా తన యూట్యూబ్‌ చానల్‌లో మాట్లాడుతూ.. హైదర్‌ అలీని ప్రశంసల్లో ముంచెత్తాడు. ప్రధానంగా తన కెరీర్‌లో తొలి పీఎస్‌ఎల్‌ ఆడుతున్న హైదర్‌ అలీలో విశేషమైన టాలెంట్‌ ఉందంటూ కొనియాడాడు.  ఏదొక రోజు వరల్డ్‌లో అందర్నీ హైదర్‌ వెనక్కినెట్టడం ఖాయమంటూ జోస్యం చెప్పాడు.

‘హైదర్‌ అలీలో కోహ్లి, బాబర్‌ అజామ్‌ల తరహా టాలెంట్‌ ఉంది. అచ్చమైన టెక్నిక్‌, క్వాలిటీ షాట్లు హైదర్‌ సొంతం. అతను బ్యాటింగ్‌లో ఎటువంటి లోపాలు లేవు. ఇక పవర్‌ హిట్టింగ్‌లో హైదర్‌ చాలా స్ట్రాంగ్‌. కాకపోతే మ్యాచ్‌పై అవగాహన అవసరం. అదే సమయంలో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఎలా ఆడాలి అనే దానిపై దృష్టి సారించాలి. ఈ రెండు తప్పితే హైదర్‌ అలీలో బ్యాటింగ్‌కు సంబంధించి మెరుగులు దిద్దాల్సిన అవసరం లేదు. కోహ్లి. అజామ్‌ల బ్యాటింగ్‌లో ఎంత సాంకేతికతో ఉందో అంతే సాంకేతికత హైదర్‌ అలీ బ్యాటింగ్‌లో కూడా ఉంది. కచ్చితంగా ఏదొక రోజు హైదర్‌ అలీ ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా ఎదుగుతాడు’ అని రమీజ్‌ రాజా అభిప్రాయపడ్డాడు. పీఎస్‌ఎల్‌ లీగ్‌ దశను ముగించుకుని నాకౌట్‌ దశకు చేరుకున్న తర్వాత  వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా