హార్దిక్‌ బాదుడే బాదుడు

3 Mar, 2020 20:46 IST|Sakshi

నవీ ముంబై: టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. వెన్నుగాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత బరిలోకి దిగిన తొలి దేశవాళీ టోర్నీలో హార్దిక్‌ మెరుపులు మెరిపిస్తున్నాడు.  డీవై పాటిల్‌ టీ20 కప్‌లో భాగంగా రిలయన్స్‌-1 జట్టు తరఫున ఆడుతున్న హార్దిక్‌ మరోసారి చెలరేగిపోయాడు. శనివారం  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 5 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్స్‌లతో 38 పరుగులు సాధించిన హార్దిక్‌.. మంగళవారం సీఎజీతో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 105 పరుగులు సాధించాడు. గ్రౌండ్‌ నలుమూలలా షాట్లు కొడుతూ పరుగుల మోత మోగించాడు. ఈ క్రమంలోనే 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

ఇన్నింగ్స్‌ ఆరంభం మొదలు హార్దిక్‌ ఎదురుదాడి చేయడంతో సీఎజీ బౌలర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. హార్దిక్‌ సెంచరీ సైతం సిక్స్‌ కొట్టి పూర్తి చేసుకోవడం మరో విశేషం. వి జీవరాజన్‌ వేసిన  ఇన్నింగ్స్‌ 15 ఓవర్‌లో హార్దిక్‌ 26 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు ఉన్నాయి. హార్దిక్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో రిలయన్స్‌ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌.. శస్త్ర చికిత్స తర్వాత న్యూజిలాండ్‌ ‘ఎ’ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా, చివరి నిమిషంలో హార్దిక్‌ ఇంకా కోలుకోలేకపోవడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. ప్రస్తుతం హార్దిక్‌ పూర్తిగా కోలుకోవడంతో ఇక టీమిండియా రీఎంట్రీ ఒక్కటే మిగిలి ఉంది. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌కు కీలక ఆటగాడైన హార్దిక్‌ కోలుకోవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. 

>
మరిన్ని వార్తలు