కోహ్లి వ్యాఖ్యలపై హర్షా భోగ్లే స్పందన

8 Nov, 2018 19:24 IST|Sakshi

న్యూఢిల్లీ:  చాలా విషయాల్లో భారత క్రికెట్‌ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆచితూచి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇటీవల కోహ్లి చేసిన ఒక కామెంట్‌ విమర్శలకు దారి తీసింది.   తన బర్త్‌ డే సందర్భంగా విరాట్ కోహ్లి అఫీషియల్ యాప్‌ను ఆవిష్కరించాడు. దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ కోహ్లిని అనవసరంగా ఎక్కువ చేసి చూపిస్తున్నారని, అతని బ్యాటింగ్‌లో తనకు ఎలాంటి ప్రత్యేకత కనిపించదని, అతని కంటే ఇంగ్లిష్, ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఆటే నచ్చుతుందని కామెంట్ చేశాడు. అయితే ఈ మాటలను స్పోర్టివ్ గా తీసుకోలేదు కోహ్లి.. అలాంటప్పుడు ‘నువ్వు ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదు.. వెళ్లి అక్కడే ఉండు. ఈ దేశంలో ఉంటూ ఆ దేశాలను ఎందుకు పొగుడుతున్నావు? ముందు నీ పద్ధతి మార్చుకో’ అంటూ క్లాస్ పీకాడు.

దాంతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు కోహ్లి. ‘ఒక వ్యక్తికి ఆటగాళ్లు నచ్చడం అనేది వారి అభిప్రాయాల్ని బట్టే ఉంటుంది. చాలా మంది ఆస్ట్రేలియా క్రికెటర్లకు తమ మాజీ ఆటగాళ్ల కంటే సచిన్ టెండూల్కర్‌గా పేర్కొంటారు.  ఏబీ డివిలియర్స్, జయసూర్య, షాహిద్‌ ఆఫ్రిది ఇలా ఆటగాళ్లకు దేశాలతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. ఈ విషయాన్నే ఆ అభిమాని చెప్పాలని అనుకున్నాడు’ అంటూ నెటిజన్లు కోహ్లికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.  కాగా,  ఈ ఘటనపై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే స్పందించాడు. ఈ విషయంలో కోహ్లి స్పందించిన తీరు సరిగా లేదని భోగ్లే అభిప్రాయపడ్డాడు. చాలా మంది ప్రముఖులు పడిపోయే బుడగలోనే కోహ్లి కూడా పడ్డాడని అతడు అన్నాడు. కోహ్లిలాంటి సెలబ్రిటీలు ఇలాంటి బుడగలు ఏర్పడకుండా చూసుకోవాలని సూచించాడు. చాలా మంది ప్రముఖులు తమకు నచ్చే విషయాలే వినాలన్న ఓ రకమైన బుడగను తమ చుట్టూ ఏర్పర్చుకుంటారు. ఇది మంచిది కాదు. ఇదే భిన్నాభిప్రాయాలకు దారి తీస్తుంది అని భోగ్లే ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని చెప్పాడు.

మరిన్ని వార్తలు