‘చాంపియన్‌’తో సమంగా...

2 Dec, 2017 00:26 IST|Sakshi

భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ ‘డ్రా’

హాకీ వరల్డ్‌ లీగ్‌ ఫైనల్స్‌ టోర్నీ  

భువనేశ్వర్‌: ప్రపంచ చాంపియన్‌ చేతిలో ఓటమి ఎదురు కాకుండా నిలువరించిన ఆనందం ఒకవైపు... లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక విజయానికి దూరమైన అసంతృప్తి మరోవైపు... హాకీ వరల్డ్‌ లీగ్‌ ఫైనల్స్‌ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత జట్టు పరిస్థితి ఇది. శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1–1తో డ్రాగా ముగిసింది. మ్యాచ్‌ 20వ నిమిషంలో మన్‌దీప్‌ సింగ్‌ గోల్‌ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించగా... వెంటనే 21వ నిమిషంలో ఆసీస్‌ తరఫున జెరెమీ హేవార్డ్‌ గోల్‌ సాధించి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్‌ నమోదు చేయలేకపోయాయి. నేడు జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్‌తో తలపడుతుంది. సొంత ప్రేక్షకుల మద్దతుతో ఈ మ్యాచ్‌లో భారత్‌ చాలా వరకు ఆధిపత్యం ప్రదర్శించింది. దూకుడుగా ప్రారంభించడంతో పాటు ఆసాంతం తమ స్థాయికంటే మెరుగైన ప్రదర్శన కనబర్చింది.

మొదట్లోనే గుర్జంత్‌ సింగ్‌ గోల్‌ చేసేందుకు చేరువగా వచ్చినా ఆసీస్‌ కీపర్‌ లావెల్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలోనే మరో రెండు సార్లు ఆకాశ్‌దీప్, గుర్జంత్‌ చేసి ప్రయత్నాలను లావెల్‌ నిరోధించాడు. ఆరో నిమిషంలో లభించిన తొలి పెనాల్టీని భారత్‌ వృథా చేసుకోగా, 12వ నిమిషంలో ఆసీస్‌ పెనాల్టీని ఆకాశ్‌ చిక్టే ఆపగలిగాడు.  ఈ మ్యాచ్‌తో భారత కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ తన కెరీర్‌లో 200 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. అతని సారథ్యంలో ఇటీవలే భారత్‌ ఆసియా కప్‌ విజేతగా నిలిచింది. మరో మ్యాచ్‌లో జర్మనీ 2–0తో ఇంగ్లండ్‌ను ఓడించింది. జర్మనీ తరఫున గ్రమ్‌బుష్, క్రిస్టోఫర్‌ గోల్స్‌ సాధించారు.  

మరిన్ని వార్తలు